డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థుల భారీ ప్రదర్శన
కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
లాఠీలతో దాడి, అరెస్టు.. పలువురికి గాయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కుల వివక్ష నిర్మూలనకు యూజీసీ నిబంధనలు అమలు చేయాలనీ, రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేయాలనీ, దళిత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విసి శాంతిశ్రీ దిలీపూడి పండిట్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్‌యూఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం లాంగ్ మార్చ్ నిర్వహించారు. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు పెంచాలనీ, విశ్వవిద్యాలయ అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆఫీస్ బేరర్లను బహిష్కరించే చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తున్న విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వారు లోపలికి వెళ్లకుండా ఢిల్లీ పోలీసులు, సీిఆర్పీఎఫ్, ఆర్‌ఎఎఫ్ దళాలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. జేఎన్‌యూఎస్‌యూ కార్యవర్గ సభ్యులతో సహా అనేక మందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు యూనివర్శిటీలోని సబర్మతి హాస్టల్ నుంచి ప్రారంభమైన లాంగ్ మార్చ్ ప్రధాన ముఖద్వారం వైపు సాగింది. విద్యార్థులు తమ తమ విద్యార్థి సంఘాల జెండాలు, ప్లకార్డులు, అంబేద్కర్, పూలే, భగత్ సింగ్ వంటి నేతల చిత్ర పటాలు చేతబూని మార్చ్‌లో కదంతొక్కారు. మార్చ్ ప్రధాన ముఖద్వారం వద్దకు చేరుకునే సరికి గేట్లకు తాళాలు వేసి పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు తమ యూనివర్శిటీ తాళాలు వేయడానికి మీరెవరంటూ ప్రశ్నిస్తూ తాళాలను పగలగొట్టారు. గేట్లు తెరుచుకున్న వెంటనే విద్యార్థులు నినాదాలు హోరెత్తిస్తూ ముందకు సాగారు. అక్కడ అప్పటికే ఏర్పాటు చేసిన బారికేడ్లతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థులు బారికేడ్లను దాటి ముందుకు సాగడంతో పోలీసులు, భద్రతా దళాలు దాడికి దిగాయి. లాఠీలతో దాడికి పాల్పడ్డాయి. దీంతో కొంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా విద్యార్థులు క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా, క్యాంపస్ నుంచి బయటకు వెళ్లకుండా నిరోధించేందుకు విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ గేట్లన్నింటికీ తాళాలు వేశారు. దాదాపు 400 మంది పోలీసులు జేఎన్‌యూ అన్ని గేట్ల వద్ద మోహరించారు. అదేవిధంగా బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌ను రంగంలోకి దింపారు. దీంతో ఉదయం నుంచి విశ్వవిద్యాలయం భద్రతా దళాల నిఘాలో ఉంది.
హక్కులపై పోరాటం చేస్తే అణచివేయడం దుర్మార్గం
మేము హక్కులపై పోరాటం చేస్తే, అణిచివేసేందుకు పోలీసులు క్రూరంగా వ్యవహరించడం సిగ్గుచేటని విద్యార్థులు విమర్శించారు. ”యూనివర్శిటీకి తాళం వేయడానికి మీకు ఎంత ధైర్యం? మా హక్కుల కోసం మేము మార్చ్ నిర్వహిస్తే అనుమతించటం లేదు. మమ్మల్ని కొట్టి నిర్బంధిస్తున్నారు. మరోవైపు గూండాలు స్వేచ్ఛగా తిరుతున్నారు” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచే యూనివర్శిటీ బలగాలను పంపడం ప్రారంభించిందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అదితి మిశ్రా తెలిపారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఆ దిశగా ఆలోచన చేయకుండా విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసేందుకు కుట్రలు పన్నిందని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై దాడి చేయడాన్ని ఆమె ఖండించారు.



