Monday, October 20, 2025
E-PAPER
Homeదర్వాజసుదీర్ఘవాక్య సృజనాత్మకత

సుదీర్ఘవాక్య సృజనాత్మకత

- Advertisement -

హంగేరియన్‌ సాహితీవేత్త, ఆధునిక శకపు మహావాక్య నిర్మాతగా కీర్తించబడిన లాస్లో క్రాస్నహోర్కై గారికి 2025 సంవత్సరపు ప్రతిష్టాత్మక నోబెల్‌ సాహిత్య పురస్కారం వరించింది. మానవుడి నిస్సహాయత, ఉనికి తాలూకా గాఢత, సమయ విచిత్ర ప్రవాహం వంటి అంశాలను తన రచనల్లో మేళవించిన ఈ అసాధారణ రచయితకు దక్కిన గౌరవంగా సాహితీలోకం దీనిని అభివర్ణిస్తోంది.

క్రాస్నహోర్కై గారికి నోబెల్‌ వరించడానికి ప్రధాన కారణం వారి రచనల్లోని దైన్యపూరితమైన, కవితాత్మక గద్యం. నిరాశ, వినాశనం అనే భావనలతో కూడిన వారి కథాకథనం ప్రపంచపు పతనం వైపు మానవుడి పయనాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపుతుంది. వారి సృష్టించిన పాత్రలు సమాజపు అంచులలో ఉంటూ, తమ జీవితాలలో లేదా ప్రపంచంలో ఏదో ఒక అద్భుతమైన మార్పు కోసం ఆశిస్తూ ఉంటాయి. కానీ ఆ మార్పు ఎప్పుడూ రాదనే విషయాన్ని తెలపకనే తెలుపుతాయి.

ఈ నిరీక్షణలోని విషాదాన్ని, వైఫల్యంలోని సౌందర్యాన్ని అత్యంత గాఢంగా, అసాధారణ శైలిలో చిత్రించడంలో క్రాస్నహెర్కై దిట్ట. మితవాద భావాలకు చిత్రిక పట్టిన రచయిత. వారి రచనలు ‘ప్రపంచపు అంతం’ అనే భావన చుట్టూ తిరుగుతాయి. అది నాగరికత పతనమైనా కావచ్చు, లేదా కేవలం ఒక వ్యక్తి ఆశలు అంతమైనా కావచ్చు. ఈ అనిశ్చితిని, అంతులేని భయాన్ని అత్యంత శక్తివంతంగా పాఠకుడికి అనుభూతిని చెందిస్తారు. అయితే సామ్యవాద వ్యవస్థకు వ్యతిరిక్త భావనలు కల రచయిత.

రచనా శైలి – వాక్యంపై కవితాత్మక పట్టు:
లాస్లో క్రాస్నహోర్కై రచనా శైలి సాంప్రదాయ కథాకథనానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారి రచనలను చదవడం అనేది ఒక ప్రత్యేకమైన, లోతైన అనుభూతి. రచనా శైలిలోని ముఖ్య లక్షణం వారి అత్యంత సుదీర్ఘమైన వాక్యాలు. ఇందులో పెద్ద పెద్ద వాక్యాలు, విరామ చిహ్నం లేని పేరాలు, కొన్నిసార్లు ఒక పుట మొత్తం విస్తరించిన వాక్యాలు కనబడతాయి. ఈ సుదీర్ఘ వాక్యాలు ఉద్దేశపూర్వకంగా కాల ప్రవాహాన్ని, నిరంతర ఆలోచనా ధారను, పాత్రల అంతులేని ఆందోళనను ప్రతిబింబిస్తాయి. ఆయన తరచుగా సంప్రదాయ విరామ చిహ్నాలను విస్మరించి, ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు నిరంతరంగా సాగిపోతున్న అనుభూతిని ఇస్తారు. దీనివలన రచన ఒక సంగీత లయను, ఒక అసాధారణమైన కవితా నాణ్యతను సంతరించుకుంటుంది. సుదీర్ఘ వాక్యాలు, పునరావతమయ్యే పదబంధాలు, నిశిత పరిశీలనల కారణంగా వారి గద్యం ప్రత్యేకమైన భావోద్వేగ గాఢతను సంతరించుకుంటుంది.

సమకాలీన సాహిత్యంలో ప్రత్యేక స్థానం:
లాస్లో క్రాస్నహోర్కై సాహిత్య శైలి మిగతావారి రచనల కంటే విభిన్నంగా ఉంటుంది. ఆధునిక రచయితలు వేగవంతమైన, సరళమైన కథనాలకు ప్రాధాన్యత ఇస్తుంటే, క్రాస్నహౌర్కై మాత్రం తమ సంక్లిష్టమైన, వక్రీకరించబడిన నిర్మాణంతో పాఠకుడిని నిలదీస్తారు. వారి రచనలో ‘ఏదైనా జరగవచ్చు’ అనే భయం లేదా ఆందోళన నిరంతరం పాఠకుడిని వెంటాడుతుంది. తన పాత్రల ఆలోచనా స్రవంతిని, వారి నిస్సత్తువను, భయాన్ని, అన్వేషణను వాక్య పొడవు ద్వారానే వ్యక్తం చేస్తారు. ఇది సాధారణ ‘చేతిలో ఇమిడిపోయే’ కథనాలకు పూర్తి విరుద్ధంగా, ‘మనసు లోపల ప్రయాణించే’ కథన శైలిని అందిస్తుంది.

ఈయన రచనలు కేవలం కథలు కావు. అవి ఉనికి, నైతికత, చరిత్ర, మానవ అస్తిత్వంపై జరిగే తాత్విక అన్వేషణలు. దీనివలన వారి సాహిత్యం కేవలం ఒక దేశానికో, భాషకో పరిమితం కాకుండా, సార్వజనీనమైన తాత్వికతను అందిస్తుంది. లాస్లో క్రాస్నహోర్కై సృజన ఆధునిక ప్రపంచపు చీకటి కోణాలను లోతుగా అన్వేషించే ధైర్యాన్ని చూపిస్తుంది. ఈ నోబెల్‌ పురస్కారం, ప్రపంచ సాహితీ రంగంలో హంగేరియన్‌ గద్యానికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. వారి రచనల పఠనం ఒక సవాలుతో కూడినప్పటికీ చివరకు అది పాఠకుడికి ఉన్నతమైన, గాఢమైన సాహిత్య అనుభూతిని మిగులుస్తుంది అనడంలో సందేహం లేదు.

  • డి జయరాం, 8247045230
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -