పదేండ్ల దొరల పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం
కమీషన్ల కక్కుర్తితో కట్టిన కాళేశ్వరం ఏమైందో చూడండి : ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం రూరల్
”ఎన్నికలు రాగానే ప్రత్యర్థులు మీ ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెబుతారు.. మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ, పదేండ్లు అధికారంలో ఉండి పేదవాడికి ఒక ఇల్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?” అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 25వ వార్డుల్లో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల శంఖారావం పూరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఆనాటి పాలకులు తమ అకౌంట్లు నింపుకోవాలని చూశారే తప్ప, సామాన్యుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి, కేవలం కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు కండ్లముందే కూలిపోతోందన్నారు. ఇది వారి అవినీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. రెండు సార్లు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిన చరిత్ర వారిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేతల ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం
తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మాట నిలబెట్టుకున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. మాటలు చెప్పేవాళ్లం కాదని, పనిచేసే వాళ్లమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టామని, అర్హులైన ప్రతి పేదవాడికీ ఇండ్ల స్థలంతోపాటు రూ. 5 లక్షల సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
వర్షాకాలం నాటికి మున్నేరు గోడ నిర్మాణం పూర్తి
ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి పునరుద్ఘాటించారు. వచ్చే వర్షాకాలం నాటికి మున్నేరు రక్షణ గోడను పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామన్నారు. ఎఫ్‌సీఐ గోడౌన్ తరలింపుతో పాటు ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.
నేడు మంత్రి కొండా సురేఖ సమావేశం
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొండా సురేఖ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న ఆమె మంత్రి పొంగులేటి లేకుండా ఆయన నియోజకవర్గంలోని సన్నాహక సమావేశానికి హాజరువుతుండటం గమనార్హం.



