Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంపొరుగు దేశాల్లో పరిస్థితి చూడండి

పొరుగు దేశాల్లో పరిస్థితి చూడండి

- Advertisement -

రాజ్యాంగం మనకు గర్వకారణం : రాష్ట్రపతి పంపిన ప్రస్తావనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు
ఎన్ని బిల్లులను నిలిపివేశారని కాదు, నిలిపివేసే అధికారంపైనే ప్రశ్న
నేడు కూడా కొనసాగనున్న విచారణ

న్యూఢిల్లీ : పొరుగుదేశాల్లో పరిస్థితిని చూడాలని, మన రాజ్యాంగం మనకు గర్వకారణమని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితులు విధించవచ్చా లేదా అనే అంశంపై రాష్ట్రపతి పంపిన ప్రస్తావనపై సుప్రీంకోర్టు బుధవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. ‘నేపాల్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్‌ హసీనా.. ఆ దేశాన్ని వీడి భారత్‌లో తలదాచుకుంటున్నారు’ అని గుర్తు చేస్తూ మన రాజ్యాంగం పట్ల గర్వపడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్‌ గవారు తెలిపారు. అలాగే దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా రాజ్యాంగం పనిచేస్తోందని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ పేర్కొన్నారు.

అలాగే, బుధవారం విచారణలో బిల్లులను నెల రోజులకు పైగా రిజర్వ్‌ చేసే విషయంలో గవర్నర్ల అధికారాలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమర్థించారు. అటువంటి కేసులు తక్కువే ఉన్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన అన్ని బిల్లుల్లో 90 శాతం బిల్లులకు గవర్నర్‌ నెలలోపే సమ్మతి తెలుపుతారని చెప్పారు. 1970 నుంచి 2025 వరకు తమిళనాడుకు చెందిన ఏడు బిల్లులు సహా కేవలం దేశవ్యాప్తంగా 20 బిల్లులు మాత్రమే రిజర్వ్‌లో ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకునివెళ్ళారు. దీనికి జస్టిస్‌ నాథ్‌ స్పందిస్తూ గవర్నర్‌ ఒక్క బిల్లును నిలిపివేశారా.. వెయి బిల్లులను నిలిపివేశారా… అన్నది ప్రశ్న కాదని, బిల్లులను గవర్నర్‌ నిరవధికంగా నిలిపివేసే అధికారం.. ఉందా.. లేదా.. అన్నదే ప్రశ్న అని స్పష్టం చేశారు. అలాగే తుషార్‌ మెహతా తన వాదనలో గవర్నర్‌ ఒక స్వతంత్ర రాజ్యాంగ పదవి, ప్రభుత్వ సేవకుడు కాదని తెలిపారు. బిల్లులకు గవర్నర్‌ ఆమోదం కేవలం లాంఛనప్రాయం కాదని, చాలా ముఖ్యమైనదని అన్నారు. తుషార్‌ మెహతా వాదనలను జస్టిస్‌ నరసింహ సమీక్షిస్తూ ‘గవర్నర్‌ బిల్లులకు అనుమతి ఇవ్వకుండా నిలువరించగలరనే వాదనను ఎలా సమన్వయం చేసుకోవాలి? ఉభయ సభలు ఆమోదించిన బిల్లును గవర్నర్‌ ఎలా పూర్తిగా నిలుపదల చేస్తారు’ అని ప్రశ్నించారు. బుధవారం వాదనలు ముగిసిన తరువాత తదుపరి విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. 200, 201 అధికరణల కింద గవర్నర్ల విచక్షణ యొక్క రాజ్యాంగ పరిధిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవారు అధ్యక్షతన గల ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది.ఈ ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఎ.ఎస్‌.చందూర్కర్‌ సభ్యులుగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -