Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  దోపిడీ.!

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  దోపిడీ.!

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక
 ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరకు అమ్ముకుని లబ్ధి పొందడానికి కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించి వారికి నిరాశే మిగులుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొందరు తమ అక్రమార్జన అనువుగా మలుచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీన్ని అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అన్నదాతలు నిట్ట నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతులకు సరిపడా గన్ని బ్యాగులు అందించకపోవడం వల్ల తూకాల్లో జాప్యం, లారీల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో ధాన్యం కొనుగోలు జరగడం లేదు .దీనికి తోడు అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు వర్షానికి తడవకుండా కాపాడుకోవడానికి అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. దొడ్డు రకం ధాన్యం క్వింటాల్ కు రూ.2320, సన్న రకం ధాన్యానికి రూ.2320 తో పాటు అదనంగా రూ.500 బోనస్ ను ప్రభుత్వం ప్రకటించింది. గోనెసంచులు సరిపడ లేకపోవడం, తేమ యంత్రాలు సరిగా పనిచేయక అకాల వర్షాలతో కొనుగోలు జాప్యం చేయడంతో కేంద్రాల్లో ధాన్యపు రాశులు పేరుకుపోయాయి. మరోవైపు దోపిడీ మాత్రం ఆగడం లేదు. కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతుల నుంచి 100 బస్తాలకు ఒక డబ్బా, ఆ పైన బస్తాలకు ఒక సంచి వడ్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తామేమి తక్కువ కాదన్నట్టు హమాలీలు కూడా అదనంగా వడ్లు లేకపోతే నగదు వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. వాస్తవానికి ధాన్యం బస్తా 41 కిలోలు తూకం వేయాల్సి ఉండగా..  41.200 కిలోలు తూకం వేస్తున్నారు.ఈ లెక్కన క్వింటాకు అరకిలో దగా చేస్తున్నారు. దీనికి తోడు లారీ డ్రైవర్లు మామూళ్ల పేరుతో ఒక బస్తా పై రెండు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరి కొంతమంది కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైస్ మిల్లర్ల గుమాస్థలతో కుమ్మక్కై తాలూ, తరుగు, తేమ పేరుతో లారీకి ఇంత అంటూ కోత విధిస్తున్నారని చెప్పి తూకంలో తేడా చూపించి ఇరువురు పంచుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్ర వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయలేని పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా సంబంధిత అధికారులు అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ఇలా రైతుల కష్టార్జితాన్ని రూ.కోట్ల రూపంలో కొనుగోలు కేంద్రాలు నిర్వాహకులు,రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు. అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -