నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు సుధీర్
నెక్లెస్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
అత్యవసర సమయాల్లో అప్రమత్తత ద్వారా నష్టాలను నివారించొచ్చని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు, మేజర్ జనరల్ ఎన్‌డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ సుధీర్ భాల్(రిటైర్డ్) అన్నారు. సోమవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని వ్యూ పాయింట్ వద్ద విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందన కోసం విస్తృతమైన మాక్ ఎక్సర్‌సైజ్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా ఫైర్ శాఖ అధికారి వెంకన్న ఆధ్వర్యంలో, ఎన్‌డీఆర్‌ఎఫ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాన్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. యువత, శాఖల అధికారులు సమన్వయంతో చురుగ్గా పాల్గొనాలని చెప్పారు.
మాక్ డ్రిల్ ఎక్సర్‌సైజ్ ద్వారా జిల్లా యంత్రాంగం అత్యవసర పరిస్థితులలో సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, భవిష్యత్‌లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని తెలిపారు. విపత్తుల సమయంలో అన్ని బృందాలు సమన్వయంతో పనిచేయాలని, ఆధ్యాత్మిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని తెలిపారు. ప్రతి సంవత్సరం వరదలు సంభవించే అలాంటి ప్రాంతాల్లో ఇటువంటి మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో, అధికారుల్లో విశ్వాసం పెరుగుతుందని స్పష్టం చేశారు. తదుపరి ఏర్పాటు చేసిన శాఖల వారీగా స్టాల్స్ వివరాలను, చేపట్టనున్న కార్యక్రమాలపై డీఆర్‌ఓఈ. వెంకటాచారి, సంబంధిత అధికారులు వివరించారు. తదుపరి కిమ్స్ ఆస్పత్రికి చేరుకొని వరదల సమయంలో ఆస్పత్రిలో బెడ్స్, చికిత్స విధానం, చేపట్టాల్సిన చర్యలపై వైద్యాధికారులకు సూచనలు సలహాలు అందించారు.



