Thursday, July 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభూములు కోల్పోయి.. వృత్తులకు దూరమై..

భూములు కోల్పోయి.. వృత్తులకు దూరమై..

- Advertisement -

– కాజీపేట ఆర్‌ఎంయు భూనిర్వాసితుల ఆవేదన
– ‘కపుర్తల’ తరహాలో.. స్థానికులకే ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌
– నష్టపరిహారంలో జాప్యం.. ఐదుగురు రైతుల మృతి
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

కాజీపేటలో రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో మరో ఎనిమిది మంది రైతు కుటుంబాలకు నేటికీ నష్టపరిహారం రాలేదు. పంజాబ్‌ రాష్ట్రంలోని కపుర్తల కోచ్‌ ఫ్యాక్టరీలో 1988లో స్థానికులకు ఉద్యోగావకాశాలు ఎలా కల్పించారో అదే తరహాలో ఇక్కడ భూములు ఇచ్చిన మా కుటుంబాలకూ ఉద్యోగాలు కల్పించాలని భూ నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. భూములు కోల్పోయి వృత్తులకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుండటంతో ఆందోళనకు గురై ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు రైతులు మనస్తాపంతో గుండెపోటుకు గురై మృతిచెందారు. మరో ఎనిమిది మంది రైతు కుటుంబాలకు నేటికీ నష్టపరిహారం అందకపోవడం గమనార్హం. మంగళవారం అయోధ్యపురం గ్రామాన్ని ‘నవతెలంగాణ’ సందర్శించింది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

” భూములు పోయాయి.. వృత్తులు మనుగడ కోల్పోయాయి.. జీవనోపాధి కరువైంది.. మా పిల్లలకు ఉద్యోగాలిచ్చి కుటుంబాలను ఆదుకోవాలి.. దాంతోపాటు ఇక్కడ నిర్మించిన ఫ్యాక్టరీలో ఇక్కడి వారికే ఉద్యోగాలు ఇవ్వాలి” అని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆర్‌ఎంయును సందర్శించిన సందర్భంలో ఆయన్ను భూ నిర్వాసితులు కలిసి మెమోరాండం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా జీవో ఇచ్చి స్థానికులను ‘సబ్‌స్టిట్యూట్‌’గా నియామకాలు జరపాలని కాజీపేట రైల్వే జాక్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 1,800 జనాభా వున్న అయోధ్యపురంలో ఫ్యాక్టరీ కోసం 160 ఎకరాలు కేటాయించారు. కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఊరు బాగుపడుతుందని, జిల్లా బాగుపడుతుందని చెబితే మా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చామని నిర్వాసితులు వాపోయారు. ఎకరాకు రూ.40 లక్షల నష్టపరిహారం ఇవ్వగా.. ఈ భూములను అనుభవిస్తున్న రైతులకు టైటిల్స్‌ లేకపోవడంతో రైతుకు ఎకరాకు రూ.8 లక్షలు, దేవాదాయ శాఖకు రూ.32 లక్షల నష్టపరిహారం చెల్లించారు. ఆర్‌ఎంయులో 112 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు కోల్పోగా, మరో రెండు కుటుంబాలు ఇండ్లను కోల్పోయాయి.

‘కపుర్తల’ తరహాలో ఉద్యోగాలివ్వాలి..
పంజాబ్‌ రాష్ట్రంలో కపుర్తల కోచ్‌ ఫ్యాక్టరీలో 1988లో 88 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇచ్చారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. ‘సబ్‌స్టిట్యూట్‌’గా నియమిస్తే నేరుగా వేతనాలు చెల్లించే అవకాశముంది. సబ్‌స్టిట్యూట్‌గా నియమితులైన వారిని పర్మినెంట్‌ చేసుకునే వెసులుబాటు కూడా వుంటుందని రైల్వే యూనియన్‌ నేతలు చెబుతున్నారు. కాగా, ఆ జీవోను తదనంతరం రద్దు చేశారు.

మరో 8 కుటుంబాలకు దక్కని నష్టపరిహారం
కాజీపేట రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయు)కు హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని 45వ డివిజన్‌ అయోధ్యపురంలోని 114 మంది రైతులు 160 ఎకరాల భూమి ఇచ్చారు. 2010 నుంచి అయోధ్యపురంలో భూసేకరణ ప్రారంభమైంది. 2015లో 55 ఎకరాల భూమి తీసుకున్నారు. అనంతరం మరో 105 ఎకరాలు సేకరించారు. ఆరేండ్లకు 2021లో నష్టపరిహారం చెల్లించారు. సర్వే నెంబర్‌ 1173లో 16 ఎకరాలుండగా, ఇందులో 9 ఎకరాలకు సంబంధించిన 8 మంది రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదు.
తొలుత ఈ భూమి సీలింగ్‌ భూమిగా నమోదైందని అధికారులు చెప్పడంతో, అది సీలింగ్‌ భూమి కాదని రైతులు ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగారు. చివరకు అది సీలింగ్‌ భూమి కాదని తేలాక నష్టపరిహారానికి అధికారులు సిఫారసు చేశారు. నేటికీ ఆ రైతు కుటుంబాలకు నష్టపరిహారం దక్కలేదు.

ఐదుగురు రైతులు మృతి
నష్టపరిహారం కోసం తిరిగి తిరిగి తీవ్ర మనస్థాపానికి గురై ఐదుగురు రైతులు మృతిచెందారు. ఇందులో మామిండ్ల శంకర్‌, మామిండ్ల సదానందం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కాయిత కుమార్‌, మామిండ్ల చిన్న రంగయ్య, ఏరుకుల రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మృతిచెందారు. కుటుంబ పెద్దదిక్కులు మృతిచెందడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి.

వ్యవసాయం పాయే..
ఫ్యాక్టరీకి భూములిచ్చినం.. మాకు యవసాయం లేకుండాపోయింది.. నా రెండెకరాల భూమి ఫ్యాక్టరీకి ఇచ్చా.. నాకిద్దరు కొడుకులు. భూమి పోయినందుకు మా పోరగాండ్లకు నౌకరొస్తే చాలు.
– గాదం యాదగిరి, మాజీ సర్పంచ్‌

నా పెనిమిటి గుండెపోటుతో చనిపోయిండు..
ఏండ్ల తరబడి నష్టపరిహారం కోసం తిరిగి తిరిగి వస్తలేదని నా పెనిమిటి రంజీతోటి గుండెపోటుతో చనిపాయే.. 5 ఎకరాలు ఫ్యాక్టరీ కింద పోతే 1.20 ఎకరాలకు ఇంకా నష్టపరిహారం ఇయ్యలే..
– కాయిత రమ, అయోధ్యపురం


మా పోరగాండ్లకు ఉద్యోగాలు కావాలే..
నాకున్న 5 ఎకరాలు ఫ్యాక్టరీ కింద తీసుకున్నారు. 1.26 ఎకరాలకు ఇప్పటి దాంక నష్టపరిహారం ఇవ్వలే.. నాకిద్దరు బిడ్డలు, కొడుకు.. మా పోరగాండ్లకు ఉద్యోగాలొస్తే చాలు.
– కాయిత రమేష్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -