ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే నేటి రోజుల్లో ప్రేమికుల ఆనందోత్సవంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రోజు వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుంటే, ఇది కేవలం ఉల్లాసానికి సంబంధించినది కాదు, త్యాగం, విశ్వాసం, ప్రేమతో నిండిన ఒక విషాద గాథకు ప్రతీక. మొదట ఇది క్రైస్తవ మతపరమైన పండుగగా ప్రారంభమై, కాలక్రమేణా ప్రేమ ఆప్యాయతలను సూచించే ప్రత్యేక దినంగా మారింది.
”నేను సమాజానికి ఎంత ప్రేమను పంచగలుగుతున్నాను?” అనే ప్రశ్న ప్రతి మనిషి హదయంలో ఒక మదువైన అలజడి సష్టించాలి. ఆ ప్రశ్న మనను మరింత దయగలవారిగా, మరింత బాధ్యతగల పౌరులుగా మార్చినప్పుడే ప్రేమికుల దినోత్సవానికి అర్థం కలుగుతుంది. ప్రేమను కోరుకోవడం కాదు, పంచుకోవడమే ఈ రోజు యొక్క నిజమైన ఉత్సవం. ఒకరి బాధను మనదిగా భావించి పంచుకోవడం, అవసరంలో ఉన్నవారికి నిశ్శబ్దంగా చేయూత ఇవ్వడం, అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకుండా ప్రశ్నించడం.ఇవన్నీ ప్రేమకు జీవంతమైన ప్రతిరూపాలు. ఇక్కడ ప్రేమ పూలలో కాదు, చేతుల్లో కనిపిస్తుంది; మాటల్లో కాదు, చర్యల్లో మెరుస్తుంది.
అందుకే ప్రేమికుల దినోత్సవం ఒక రోజు మాత్రమే జరుపుకునే పండుగ కాకూడదు. అది మన ఆలోచనలకు దిశ చూపించే ఒక సందేశంగా, మన జీవన విధానానికి ఒక మార్గదర్శకంగా నిలవాలి. ఆ రోజున మనం ప్రేమను సెలబ్రేట్ చేయడమంటే-మనిషిగా మారడాన్ని సెలబ్రేట్ చేయడమే. అదే ఈ దినోత్సవానికి అసలైన గౌరవం, నిజమైన సంబరం.
మూడవ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి క్లాడియస్ క్రైస్తవ మత బోధనలను నిషేధించాడు. ఆ సమయంలో సెయింట్ వాలెంటైన్ అనే పూజారి క్రైస్తవ మతాన్ని బోధిస్తూ ప్రజల్లో ఆదరణ పొందాడు. దీంతో చక్రవర్తి అతనిపై అక్రమ ఆరోపణలు చేసి జైలులో పెట్టి, చివరకు మరణశిక్ష విధించాడు. జైలులో ఉన్నప్పటికీ వాలెంటైన్ మంచి పనులు చేస్తూ, జైలర్ అంధ కుమార్తె జూలియాను స్వస్థపరిచాడని చెబుతారు. వాలెంటైన్‌పై ప్రేమ పెంచుకున్న జూలియా, అతన్ని చూడాలని ప్రయత్నించినా, ఫిబ్రవరి 14న అతనిని ఉరితీశారని తెలిసి తీవ్రంగా విషాదానికి గురైంది. ఆ తర్వాత ఆమె ప్రతిరోజూ వాలెంటైన్ సమాధి వద్ద గులాబీలు ఉంచుతూ అతన్ని స్మరించేది. ఈ విధంగా ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసిన సెయింట్ వాలెంటైన్ జ్ఞాపకార్థంగా ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా జరుపుకుంటున్నారని చెబుతారు.

భావాలతో నడిచే మనిషి జీవితం
మనిషి జీవితం భావాలతో నడిచే నిరంతర ప్రయాణం. ఆలోచనలకు దిశ చూపేది, చర్యలకు ప్రేరణనిచ్చేది ఈ భావాలే. ఆనందం, బాధ, ఆశ, భయం, ఈ అన్నిటి మధ్య మనిషిని నిలబెట్టే అత్యంత పవిత్రమైన భావం ప్రేమ. అదే ప్రేమ సమాజాన్ని కలిపి ఉంచే మూలశక్తిగా, మానవ సంబంధాలకు ఆధారంగా నిలుస్తుంది.
ఫిబ్రవరి 14గా గుర్తింపు పొందిన ప్రేమికుల దినోత్సవం, నేటి కాలంలో కేవలం వ్యక్తిగత అనురాగాల వ్యక్తీకరణకే పరిమితం కావడం దురదష్టకరం. ప్రేమను వ్యక్తిగత హదయాల మధ్య మాత్రమే బంధించే ఆలోచన, దాని విశాల స్వరూపాన్ని కుదింపు చేస్తోంది. నిజానికి ఈ రోజు మన సామాజిక విలువలను తిరిగి పరిశీలించుకునే ఒక గంభీరమైన అవకాశంగా మారాలి.
ప్రేమ మన ప్రవర్తనలో ఎంత స్థాయిలో ప్రతిబింబిస్తోంది? మన మాటల్లో ఎంత సహనం ఉంది? మన సంబంధాలను ఎంత బాధ్యతతో, ఎంత నిజాయితీతో నడిపిస్తున్నాం? స్వార్థానికి చోటు లేకుండా, పరస్పర గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మనం జీవించగలుగుతున్నామా? ఈ ప్రశ్నలు ఈ రోజున ప్రతి మనిషిని లోతుగా ఆలోచింపజేయాలి.
ఎందుకంటే ప్రేమ కేవలం చెప్పుకునే మాట కాదు; అది మన నడవడికలో, మన నిర్ణయాలలో, మన స్పందనల్లో కనిపించాలి. ప్రేమ ఉన్న చోట సంబంధాలు బలపడతాయి; ప్రేమ లేని చోట అవి భారం అవుతాయి. ప్రేమ మనిషిని వ్యక్తిగా పరిపక్వం చేస్తే, సమాజాన్ని మానవీయంగా మారుస్తుంది.
అందుకే ప్రేమికుల దినోత్సవం ఒక ఉత్సవంగా మాత్రమే మిగలకూడదు. అది మన మనసులను శుద్ధి చేసే ఆలోచనా సందర్భంగా, మన మానవత్వాన్ని బలపరిచే ఒక మైలురాయిగా నిలవాలి. ప్రేమను మన జీవిత తత్వంగా స్వీకరించినప్పుడే, ఈ రోజు నిజమైన అర్థంతో, శాశ్వత విలువతో వెలుగొందుతుంది.
ప్రేమ – ఆకర్షణ కాదు, సంస్కారం:
ప్రేమ అనేది క్షణిక ఆకర్షణతో మొదలయ్యే భావం కాదు. అది చూపుల మాయలో పుట్టే ఉత్కంఠ కాదు, మాటల మాధుర్యంలో కరిగిపోయే తాత్కాలిక అనుభూతి కూడా కాదు. నిజమైన ప్రేమ త్యాగంతో, బాధ్యతతో, పరస్పర అవగాహనతో క్రమంగా ఎదిగే ఒక సంస్కారం. అది మనిషిని లోపల నుంచి తీర్చిదిద్దుతూ, అతని ఆలోచనలను, ప్రవర్తనను, విలువలను మెల్లగా శుద్ధి చేస్తుంది.
ఆకర్షణ అనేది తనకు నచ్చినదాన్ని కోరుకుంటుంది, ప్రేమ మాత్రం ఎదుటివారి అవసరాలను అర్థం చేసుకుంటుంది. ఆకర్షణకు సహనం తక్కువ, ప్రేమకు సహనం ప్రాణం. అందుకే ప్రేమ అనేది పొందడంలో కాదు, నిలబెట్టుకోవడంలో, కాపాడుకోవడంలో, అవసరమైనప్పుడు త్యాగం చేయడంలో తన అసలైన రూపాన్ని చూపిస్తుంది. ఈ అర్థంలో ప్రేమ ఒక భావోద్వేగం మాత్రమే కాదు-అది ఒక జీవన శిక్షణ.
వ్యక్తిగత స్థాయిలో పుట్టిన ప్రేమ, కుటుంబంగా విస్తరించినప్పుడే దానికి మూల బలం లభిస్తుంది. కుటుంబంలో ప్రేమ బాధ్యతగా మారుతుంది, పరస్పర గౌరవంగా, అర్థం చేసుకునే గుణంగా రూపాంతరం చెందుతుంది. అక్కడే ప్రేమ స్వార్థాన్ని విడిచిపెట్టి, సహజీవనాన్ని నేర్చుతుంది. ఆ కుటుంబ ప్రేమ సమాజ హితానికి దారి తీసినప్పుడే ప్రేమ యొక్క సార్థకత పూర్తిగా అవగతమవుతుంది.
ప్రేమ లేని చోట అనుమానం పెరుగుతుంది, అహంకారం రాజ్యమేలుతుంది. మనుషుల మధ్య విశ్వాసం కరిగిపోతుంది; సంబంధాలు హదయాల అనుబంధంగా కాక, అవసరాల ఒప్పందాలుగా మారిపోతాయి. అప్పుడు మానవ సంబంధాలు యాంత్రికంగా మారి, మనిషి మనిషికి దూరమవుతాడు.
అందుకే ప్రేమను ఒక సంస్కారంగా పెంచుకోవాలి. అది మన మాటల్లో కాక, మన నడవడికలో కనిపించాలి. వ్యక్తి నుంచి కుటుంబానికి, కుటుంబం నుంచి సమాజానికి విస్తరించే ప్రేమే నిజమైన మానవ పురోగతికి బీజం. అటువంటి ప్రేమ ఉన్న చోటే మనిషి విలువ నిలుస్తుంది; సమాజం మానవీయంగా నిలబడుతుంది
వినియోగవాదంలో మసకబారుతున్న ప్రేమ:
నేటి వినియోగవాద సమాజంలో మనిషి అవసరాలకే కాదు, అతని భావోద్వేగాలకు కూడా మార్కెట్ విలువ కట్టబడుతోంది. ఈ ప్రక్రియలో ప్రేమ కూడా ఒక స్వచ్ఛమైన మానవ అనుభూతి నుండి, వినియోగించాల్సిన ఒక వస్తువుగా మలచబడుతోంది. ప్రేమను అనుభూతి పరచే విషయంగా కాకుండా, ప్రదర్శించాల్సిన అంశంగా మార్చే ధోరణి వేగంగా విస్తరిస్తోంది.
ప్రేమను కొలిచే ప్రమాణాలుగా ఇప్పుడు ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన వేడుకలు, బహిరంగ ప్రదర్శనలు, డిజిటల్ గుర్తింపులు మారాయి. సామాజిక మాధ్యమాలలో కనిపించే హదయ చిహ్నాలు, ఫోటోలు, స్టేటస్‌లు ప్రేమ యొక్క లోతును సూచించేవిగా కాక, దాని ప్రచారానికి సాధనాలుగా మారుతున్నాయి. ”ఎంత ఖర్చు చేశాం?” ”ఎంత అర్థం చేసుకున్నాం?” అనే ప్రశ్నను మెల్లగా మింగేస్తోంది.
ఈ ఆర్భాటాల మధ్య ప్రేమ యొక్క మౌలిక విలువ-త్యాగం, సహనం,పరస్పర గౌరవం, బాధ్యత-క్రమంగా నీరుగారిపోతోంది. ప్రేమ శబ్దంతో కొలవబడుతున్న కొద్దీ, దాని నిశ్శబ్ద స్వరూపం కనుమరుగవుతోంది. నిజమైన ప్రేమ గలగల మాట్లాడదు, వెలుగులో నిలబడదు,అది వెలుపల కనిపించకపోయినా,లోపల మనిషిని మార్చే శక్తిగా పనిచేస్తుంది. నిజమైన ప్రేమ నిశ్శబ్దంగా మనిషి అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. అది వ్యక్తిని వినమ్రత వైపు, పరిపక్వత వైపు నడిపిస్తుంది. ఆశలు, అహంకారాలు, స్వార్థాలను సన్నగా తొలగిస్తూ, వ్యక్తిత్వాన్ని లోతుగా తీర్చిదిద్దుతుంది. ప్రేమ ఇక్కడ ఒక అనుభూతి మాత్రమే కాదు – ఒక సాధన, ఒక శిక్షణ, ఒక జీవన తత్వం.అందుకేవినియోగవాదపు వెలుగుల్లో మెరిసే ప్రేమ కన్నా, నిశ్శబ్దంలో ఎదిగే ప్రేమే శాశ్వతమైనది. ఖర్చుతో కాదు, కర్తవ్యంతో నిలిచే ప్రేమే మనిషిని నిజమైన మానవుడిగా మలుస్తుంది. ఈ కాలంలో ప్రేమను రక్షించుకోవడం అంటే-ఆర్భాటాన్ని తిరస్కరించి, అర్థాన్ని అంగీకరించడమే. అదే ప్రేమకు తిరిగి దాని ఆత్మను అందించే మార్గం.

యువతకు విలువల పాఠం:
సామాజిక దష్టితో పరిశీలిస్తే, ప్రేమికుల దినోత్సవం యువతకు కేవలం భావోద్వేగాల వ్యక్తీకరణకు మాత్రమే పరిమితమైన రోజు కాకూడదు; అది జీవన విలువలను తిరిగి పరిశీలించుకునే సందర్భంగా మారాలి.ప్రేమ అనేది అడ్డంకులు లేని స్వేచ్ఛగా మాత్రమే భావించటం యువతలో అపార్థాలకు దారి తీస్తోంది. నిజమైన ప్రేమ అంటే మరొకరి వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను, పరిమితులను గౌరవించగలగడం. అలాగే ప్రేమ హక్కుల జాబితా కాదు, అది బాధ్యతల అంగీకారం.పరస్పర విశ్వాసం, సహనం, సంయమనం లేని చోట ప్రేమ స్వార్థంగా మారుతుంది. ప్రేమ పేరుతో కనిపించే అసహనం, నియంత్రణ, హింస వంటి ప్రవర్తనలు వాస్తవానికి ప్రేమకు పూర్తిగా విరుద్ధమైన వికత రూపాలు మాత్రమే. యువత ఈ తేడాను గుర్తించినప్పుడే ప్రేమ మానవ సంబంధాలను నిర్మించే శక్తిగా మారుతుంది, లేనిపక్షంలో అదే ప్రేమ సమాజానికి సంక్షోభంగా మారే ప్రమాదం ఉంటుంది.
ప్రేమ యొక్క విస్తత రూపాలు:
ప్రేమను చాలాసార్లు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మధ్య జరిగే భావోద్వేగంగా మాత్రమే చూడటం జరుగుతుంది. కానీ నిజానికి ప్రేమ అలా పరిమితమైనది కాదు. అది వ్యక్తిని వ్యక్తితోనే కాదు, వ్యక్తిని సమాజంతో గాఢంగా అనుసంధానించే విశాలమైన మానవీయ శక్తి. ప్రేమ మన హదయాలను విస్తరించి, ”నా వారు” అనే సంకుచిత వలయాన్ని దాటి ”మనవాళ్లు” అనే విశ్వ దష్టికి తీసుకెళ్తుంది.తల్లిదండ్రుల పట్ల మనలో కలిగే కతజ్ఞత ప్రేమ యొక్క తొలి పాఠం. వారి త్యాగాలను గుర్తించి, జీవితాంతం గౌరవంతో చూసే మనసే నిజమైన ప్రేమకు నిదర్శనం. అలాగే గురువుల పట్ల మనలో కలిగే గౌరవభావం కూడా ప్రేమకు చెందిన ఒక శ్రేష్ఠమైన రూపం. వారు ఇచ్చే విద్య కేవలం జ్ఞానమే కాదు; మనిషిగా నిలబడే విలువలను నేర్పే మార్గదర్శనం.స్నేహితుల పట్ల నిబద్ధత, పరస్పర విశ్వాసం, కష్టసుఖాల్లో తోడుగా నిలిచే తత్వశీ, ఇవన్నీ ప్రేమకు చెందిన మరొక విశాల రూపం. ప్రేమ ఇక్కడ మాటలకన్నా కార్యరూపంలో కనిపిస్తుంది. అవసర సమయంలో నిశ్శబ్దంగా చేయూతనిచ్చే హదయమే ప్రేమ యొక్క నిజమైన రూపాన్ని ప్రతిఫలిస్తుంది.
ఇక సమాజంలోని అణగారిన వర్గాలు, అనాథలు, వద్ధులు, వికలాంగుల పట్ల మనలో కలిగే మానవీయ కారుణ్యం ప్రేమకు అత్యున్నత స్థాయి. రక్తసంబంధం లేకపోయినా, పరిచయం లేకపోయినా, వారి బాధను మన బాధగా అనుభూతి చెందగలగడం ప్రేమ యొక్క విశాలతకు పరాకాష్ఠ. అది దయగా, సేవగా, బాధ్యతగా మారి సమాజాన్ని మరింత మానవీయంగా తీర్చిదిద్దుతుంది.
అందువల్ల ప్రేమను కేవలం వ్యక్తిగత అనుభూతిగా కాక, సమాజాన్ని మదువుగా, సమానత్వంగా, సహనంతో ముందుకు నడిపించే మహాశక్తిగా చూడాలి. ప్రేమ ఉన్న చోట మనుషుల మధ్య గీతలు చెరిగిపోతాయి, హదయాల మధ్య దూరాలు తగ్గిపోతాయి. అదే ప్రేమ యొక్క నిజమైన విస్తత రూపం,మనిషిని మరింత మనిషిగా మార్చే శక్తి.
ప్రేమ అనేది ఒక సామరస్య శక్తి:
ప్రేమ సమాజానికి ఇచ్చే అతిపెద్ద కానుక సామరస్యము. అది మనిషి హదయాలలో దాగి ఉన్న కఠినతను కరిగించి, మదుత్వానికి మార్గం వేస్తుంది. ప్రేమ ఉన్న చోట ద్వేషానికి చోటు ఉండదు, అసహనం నెమ్మదిగా కరిగిపోతుంది; విభేదాలు ఘర్షణలుగా కాక, సంభాషణలుగా రూపాంతరం చెందుతాయి. ప్రేమ మనుషుల మధ్య గోడలు కట్టదు-వంతెనలు వేస్తుంది. అది వ్యక్తి-వ్యక్తి మధ్యనే కాదు, కుటుంబాలు, సమాజాలు, జాతులు మధ్య కూడా అనుబంధాన్ని పునాదిగా నిర్మిస్తుంది.
ప్రేమ ఉన్న చోట స్వార్థం వెనక్కి తగ్గుతుంది, త్యాగం ముందుకు వస్తుంది. ‘నేను’ అనే భావం ‘మనము’గా మారుతుంది. మనసుల్లో పుట్టే అనుమానాలు, అపోహలు ప్రేమ వెలుగులో చెదిరిపోతాయి. మాటలలో మాధుర్యం, చూపుల్లో ఆప్యాయత, చర్యల్లో బాధ్యత కనిపిస్తాయి. అందుకే ప్రేమ కేవలం భావోద్వేగం మాత్రమే కాదు; అది సమాజాన్ని నడిపించే ఒక శక్తివంతమైన నైతిక శక్తి.
ఈ దష్టితో చూస్తే, ప్రేమికుల దినోత్సవం కేవలం ఒక క్యాలెండర్ తేదీగా పరిమితం కాకూడదు. అది మన ఆలోచనలను శుద్ధి చేసే, మన సంబంధాలను పునఃపరిశీలనకు ఆహ్వానించే ఒక ఆలోచనా ఉద్యమంగా మారాలి. ప్రేమను మాటల్లోనే కాదు, మన ప్రవర్తనలో, మన సహనంలో, మన అర్థం చేసుకునే గుణంలో ప్రతిబింబింపజేయాల్సిన అవసరం ఉంది.ఒక రోజు ప్రేమను సెలబ్రేట్ చేయడమే కాదు, ప్రతి రోజూ ప్రేమతో జీవించడమే అసలైన వేడుక. ఎందుకంటే ప్రేమే మనిషిని మనిషిగా నిలబెట్టే మూలశక్తి; అదే సమాజాన్ని సామరస్యపు దిశగా నడిపించే శాశ్వత దీపం
ప్రేమ – ఉత్సవం కాదు, సామాజిక బాధ్యత
ప్రేమ వ్యక్తిగత ఆనందానికి పరిమితం కాకుండా, సామాజిక చైతన్యంగా మారినప్పుడే సమాజం నిజంగా ముందుకు సాగుతుంది. ప్రేమను కేవలం వ్యక్తిగత అనురాగంగా మాత్రమే చూడటం దాని విశాల స్వరూపాన్ని చిన్నదిగా చేయడమే. ప్రేమ సమాజాన్ని మదువుగా తీర్చిదిద్దే శక్తి, అది వ్యక్తిని బాధ్యతగల పౌరుడిగా మార్చే ప్రేరణ.
వాలెంటైన్స్‌డేను కేవలం ప్రేమికుల వినోద దినంగా మాత్రమే చూసినప్పుడు, అది తన అసలైన అర్థాన్ని కోల్పోతుంది. హదయాల సంబరంగా ఉండాల్సిన రోజు, ఆర్భాటాల ప్రదర్శనగా మారినప్పుడు ప్రేమ యొక్క ఆత్మ మసకబారుతుంది. ప్రేమ స్వార్థానికి అలంకారంగా మారినప్పుడు సంబంధాలు బలపడవు,మెల్లగా బలహీనపడతాయి. ఎందుకంటే నిజమైన ప్రేమ కోరుకోవడం కాదు, కాపాడుకోవడం నేర్పుతుంది.
ప్రేమ యొక్క నిజమైన సామాజిక కొలమానాలు ఖరీదైన బహుమతుల్లో కాదు. మహిళల పట్ల గౌరవంలో, బలహీన వర్గాల పట్ల భద్రతలో, యువతలో విలువల స్పహలో అవి స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ప్రేమ ఉన్న సమాజంలో మహిళ భద్రంగా ఉంటుంది, అణగారిన వర్గాలు ధైర్యంగా నిలబడతాయి, యువత స్వార్థం కాక, సేవను విలువగా భావిస్తుంది.ప్రేమను మాటల్లో ప్రకటించడం సులభమే, కానీ ప్రవర్తనలో చూపించడమే అసలైన సంబరం. ఒకరినొకరు గౌరవించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, బాధలో ఉన్నవారికి చేయూత ఇవ్వడం, ఇవే ప్రేమకు జీవంతమైన రూపాలు. ఇక్కడ ప్రేమ శబ్దంగా కాదు, చర్యగా మారుతుంది.ద్వేషం, విభజన, అసహనం పెరుగుతున్న ఈ కాలంలో ప్రేమను ఉత్సవంగా కాక, ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించడమే వాలెంటైన్స్ డే మనకు ఇచ్చే అసలైన పాఠం.
ప్రేమికుల దినోత్సవం – ఆత్మపరిశీలనకు ఆహ్వానం:
ప్రేమికుల దినోత్సవాన్ని నిజంగా గౌరవించాలంటే, ఆ రోజును కేవలం బహుమతులకో, సందేశాలకో, ఫొటోలకో పరిమితం చేయకూడదు. అది మనలోని మానవత్వాన్ని స్మరించుకునే ఒక ఆత్మీయ వేడుకగా మారాలి. ప్రేమను బయట చూపించడమే కాదు – లోపల ఎంతవరకు జీవిస్తున్నామో ప్రశ్నించుకునే సందర్భమే ఈ రోజు యొక్క అసలైన సంబరము.
డా||బామండ్ల రాజు, 9966669313



