Sunday, April 5, 2026
E-PAPER
Homeనెమలీకమూగజీవాలపై ప్రేమ

మూగజీవాలపై ప్రేమ

- Advertisement -

నరసింహపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి మూడు ఎద్దులు ఉండేవి. అందులో ఒకటి ముసలిఎద్దు. రామయ్య ఎద్దులలో రెండు ఎద్దులు చాలా వేగంగా నడిచేవి. కానీ ఈ ముసలి ఎద్దు మాత్రం చాలా నెమ్మదిగా నడిచేది. ఆయన తన పొలానికి వేగంగా పరిగెత్తే ఆ రెండు ఎద్దులను బండికి కట్టుకొని పోయేవాడు. ఈ ముసలి ఎద్దు వెనుక నుండి నెమ్మదిగా బండి వెనుక నడుస్తూ వచ్చేది. ఇది నెమ్మదిగా నడవడం రామయ్య కొడుకైన వేణుకు నచ్చలేదు. అతడు తండ్రితో ”నాన్నా! నెమ్మదిగా నడిచే ఈ ముసలి ఎద్దు మనకెందుకు? దీనికి తిండి దండగ. మనం దీన్ని ఎవరికైనా అమ్మేద్దాం. చక్కగా పనిచేసే ఈ రెండు ఎద్దులు మనకు చాలుగా!” అన్నాడు. అప్పుడు రామయ్య ”వద్దురా! ఇప్పుడు దీన్ని ఎవరూ కొనరు. ఇది ఎన్నో ఏళ్ల నుండి మన వద్దే ఉంటున్నది. ఇన్ని రోజులు మనకు పనిచేసి ప్రస్తుతం ఇప్పుడు శక్తి హీనురాలైంది. అయినా ఇప్పుడు దానికి మనం మేత కూడా సరిగా పెట్టడం లేదు. అదే ఎక్కడో బయట తిని వస్తున్నది. మన ఎద్దులలో ఒకటి అస్వస్థతతో పని చేయనప్పుడు ఇది అప్పుడప్పుడు తనకు చేతకాకున్నా కొంచెం కొంచెంగా పనిచేస్తున్నది కూడా!” అన్నాడు. సరేనన్నాడు వేణు.

ఒకసారి వేణు తన పొలానికి వెళ్లి బండిని అక్కడే వదలిపెట్టి వచ్చాడు. మరునాడు ఉదయం ఈ మూడు ఎద్దులను తోలుకొని బండి లేకుండానే అడవి సమీపంలోని తన పొలానికి బయలుదేరాడు. వేగంగా నడిచే తమ రెండు ఎద్దులను పనికి ఉంచుకొని ఈ ముసలి ఎద్దును మేతకై అక్కడ వదలి పెట్టాడు. తర్వాత అక్కడ తన పని ముగించుకొని రిగి బండిని అక్కడే వదలిపెట్టి వస్తున్నాడు. వేగంగా నడిచే అతని రెండు ఎద్దులు అతని కన్నా ముందే పరిగెత్తి ఇంటికి చేరుకున్నాయి. ఈ ముసలి ఎద్దు మాత్రం నెమ్మదిగా అతని వెనుక నడుస్తూ వస్తున్నది. ఇంతలో వేణుకు దూరంగా సింహం కనిపించింది. అతడు దానికి భయపడి ఒక చెట్ల పొదల్లో దాక్కున్నాడు. తన వెనుక నెమ్మదిగా నడుస్తూ వస్తున్న ఈ ముసలి ఎద్దు సింహానికి తప్పకుండా బలి అవుతుందని వేణు భావించాడు. తాను ముందు వేగంగా నడుస్తూ వచ్చాడు. ఆ సింహం ఆకలితో ఉండి ఏదైనా జంతువు దొరుకుతుందేమోనని ఎదురుచూసింది. చాటు నుండి వేణు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు.
ఇంతలో ఆ ముసలి ఎద్దు అదష్టం కొలది ఆ సింహం అనుకోకుండా వెనుక వైపుకు చూసింది.

దానికి దూరంగా ఒక అడవి దున్న కనబడింది. వెంటనే ఆ సింహం వెనుకకు మరలి వేగంగా పరిగెత్తి ఆ అడవి దున్న వైపుకు వెళ్లి పోయింది. ఆ ముసలి ఎద్దు నెమ్మదిగా నడుస్తూ తర్వాత వేణు వద్దకు చేరుకుంది అప్పుడు వేణు ”ఆహా! ఏమి దీని అదష్టం! అందుకే ఆ సింహానికి అడవి దున్న కనబడింది. ఇది నెమ్మదిగా నడచి రావడం వల్లే బ్రతికి బట్ట కట్టింది. తొందరగా పరిగెత్తి వస్తే ఆ సింహానికి ఇది బలి అయ్యేది. అందుకే పెద్దలు సందర్భాన్ని బట్టి దేనికీ తొందరపడకూడదని నిదానమే ప్రధానమని అన్నారు. వారు చెప్పింది నిజమే! కొన్ని సార్లు తొందరపాటు పనికి రాదు. ఇది ఒకవేళ తొందరగా నాతో పాటు ముందు వస్తే ఆ సింహం ఈ ఎద్దును వదిలేది కాదు. మా నాన్న చెప్పింది నిజమే! ఇది తన ప్రాణాన్ని తానే కాపాడుకొంది. ఇది నోరులేని మూగజీవి. పాపం! ఇది ఇంకా అప్పుడప్పుడు పని చేస్తూనే ఉంది. దీన్ని అమ్మేయమని అనడం నాదే బుద్ధి తక్కువ” అని తలచాడు. ఆనాటి నుండి వేణు మూగజీవాలపై ప్రేమను పెంచుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రికి జరిగిన సంగతిని చెప్పాడు. తన కొడుకులో వచ్చిన మార్పుకు ఆ తండ్రి ఎంతో సంతోషించాడు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -