సాధారణంగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులు ఏమీ పట్టించుకోరు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోయి విహరిస్తుంటారు. ఒకరిపై ఒకరికి ఉండే ఆకర్షణ, వ్యామోహం, వారికి మరొక ఆలోచనే లేకుండా చేస్తుంది. కొందరైతే ప్రేమను టైంపాస్‌గా భావిస్తారు. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే భావోద్వేగస్థితి వల్ల ఇలాంటి భావన వుంటుంది. చివరకు కులం, మతం, ప్రాంతం లాంటివి కూడా ఆ సమయంలో కనిపించవు. ఇక పెండ్లి దగ్గరకు వచ్చినప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. వాళ్లది నిజమైన ప్రేమా కాదా అనేది తేలిపోతుంది. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్ (ఐలమ్మ ట్రస్ట్)లో మీ కోసం…
పూజకు 25 ఏండ్లు ఉంటాయి. తల్లి దండ్రులు గ్రామంలో వ్యవసాయం చేస్తారు. ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు. ఇద్దరూ చదువుకుంటున్నారు. పూజ బీటెక్ పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఆమె దినేష్‌ను ప్రేమించింది. పెండ్లి కూడా చేసుకోవాలనుకుంది. కానీ ప్రస్తుతం దినేష్, పూజను పెండ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. కానీ పూజ మాత్రం దినేష్‌ని తప్ప ఇంకొకరిని పెండ్లి చేసుకోనంటూ తేల్చి చెబుతోంది. ‘ఏది ఏం జరిగినా నేను మాత్రం దినేష్‌నే పెండ్లి చేసుకుంటాను. అతనిని తప్ప ఇంకొకరి గురించి నేను ఆలోచించలేను’ అంటుంది.
దానికి మేము ‘మరి దినేష్ నిన్ను పెండ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు, అతను వద్దంటున్నా నువ్వెందుకు అతన్నే చేసుకోవాలనుకుంటున్నావు, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది’ అని అడిగితే..
‘నేనూ దినేష్ కాలేజీ రోజుల నుండి ప్రేమించుకున్నాం. చదువు పూర్తి చేసిన తర్వాత ఇద్దరం ఒకే కంపెనీలో ఉద్యోగంలో చేరాం. అలా ఓ ఏడాది అక్కడ ఉద్యోగం చేశాం. తర్వాత నేను ఆ కంపెనీలో మానేసి వేరే కంపెనీలో చేరాను. దినేష్ కూడా ఆరు నెలల తర్వాత ఆ ఉద్యోగం మానేసి నేను చేసే కంపెనీలోనే చేరాడు. ఇలా ఇద్దరం మూడు కంపెనీల్లో పని చేశాం. నేను హాస్టల్లో ఉండేదాన్ని. దినేష్ తన స్నేహితులతో కలిసి రూమ్‌లో వుండే వాడు. మేమిద్దరం తరచూ వాళ్ల రూమ్‌లో కలిసి ఉండేవాళ్లం. దినేష్ స్నేహితులు అందరూ రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో అతను మాత్రమే రూమ్‌లో ఉండేవాడు. అప్పటి నుండి ప్రతి శని, ఆదివారాలు, ఏదైనా పండుగలు వచ్చినప్పుడు, సెలవులు వున్నప్పుడు మేము కలిసే వుండేవాళ్లం. అతను నన్ను పెండ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అతనికి బాగా దగ్గరయ్యాను.
కానీ అతను నాతో కలిసి ఉంటూనే వేరే అమ్మాయిని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేను ఒకరోజు అతనిలో రూమ్‌లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నుండి మెసేజ్‌లు రావడం నేను చూశాను. దాంతో అతన్ని గట్టిగా నిలదీశాను, గొడవ పెట్టుకున్నాను. నన్ను విపరీతంగా కొట్టాడు. అప్పటి నుండి మా ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. రెండు మూడు రోజులు బాగానే వుండేవాళ్లం. మళ్లీ గొడవలు జరిగేవి. కానీ అతను మాత్రం తన పెండ్లి ఏర్పాట్లు మానుకోలేదు. ‘మా ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు’ అంటూ దాటవేసేవాడు. అయితే నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి మా గురించి చెప్పాను. దాంతో దినేష్‌కి నాకూ మధ్య మళ్లీ గొడవ మొదలయింది. ‘నువ్వు నాకు అవసరం లేదు, నిన్ను పెండ్లి చేసుకోను’ అన్నాడు.
నాకు కోపం వచ్చి అతనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాను. ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మాది తక్కువ కులమని వాళ్ల ఇంట్లో వాళ్లు మా పెండ్లికి ఒప్పుకోవడం లేదు. ఇన్నేండ్లు నాతో కలిసి ఉన్నప్పుడు గుర్తుకు రాని కులం పెండ్లికి మాత్రం గుర్తుకు వచ్చింది. అందుకే అతనిపై కేసు పెట్టాను. పదిహేను రోజులు జైల్లో కూడా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడడం లేదు. అతని అన్నయ్య వచ్చి దినేష్‌ను ఊరికి తీసుకెళ్లాడు. గతంలో రెండు సార్లు నేను వాళ్ల ఊరికి కూడా వెళ్లాను. రెండో సారి వెళ్లినప్పుడు వాళ్ల అమ్మకు అనుమానం వచ్చింది. అందుకే వేరే అమ్మాయితో పెండ్లి ఫిక్స్ చేసింది. కానీ నేను మాత్రం దినేష్‌నే పెండ్లి చేసుకుంటాను. మీరే ఎలాగైనా మాట్లాడి మా పెండ్లి జరిగేలా చూడండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఆమె చెప్పింది మొత్తం విన్న తర్వాత ‘అతను నిన్ను పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. నీపై కోపంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పెండ్లి చేసుకుంటే జీవితాంతం నువ్వు ఇబ్బందులు పడాల్సిందే. కులం పిచ్చితో ఉన్నవాళ్ల మధ్యకు వెళ్లి అనవసరంగా కష్టాలు పడొద్దు. కనీసం నువ్వు ప్రేమించిన వ్యక్తి అయినా నిన్ను అర్థం చేసుకుంటే పెద్ద వాళ్లతో మాట్లాడి పెండ్లి చేయవచ్చు. కానీ అతను నీకు తెలియకుండా వేరే అమ్మాయిని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. నిన్ను పెండ్లి చేసుకోవడం ఎవ్వరికీ ఇష్టం లేదు. అయినా నువ్వు అతన్నే పెండ్లి చేసుకుంటానంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. జీవితం అంటే సినిమా కాదు. అతన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే నీకే మంచిది’ అని సర్ధి చెప్పాము.
ఎంత చెప్పినా పూజ వినడం లేదు. ‘అతనితో ఒక్కసారి మాట్లాడండి’ అంటూ బతిమలాడింది. దాంతో మేము అతనికి ఫోన్ చేశాము. కానీ కలవలేదు. అతని తల్లిదండ్రులకు కూడా చేశాము. వాళ్ల నెంబర్ కూడా పని చేయలేదు. చివరకు అతని అన్నయ్యకు చేస్తే ‘నాకూ మా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. అతని జీవితం అతని ఇష్టం. పూజ అతనిపై కేసు పెట్టి జైలుకు పంపించింది. అలాంటి అమ్మాయిని ఎలా పెండ్లి చేసుకుంటాడు. పైగా ఆమె కులం కూడా వేరు. పోలీస్ స్టేషన్‌లోనే నేను పూజతో అతన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించమని చెప్పాను. ఆమె అనవసరంగా దినేష్ వెంటపడుతుంది. మీరే ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి. ఈ విషయం గురించి అయితే దయచేసి నాకు ఇంకెప్పుడూ ఫోన్ చెయ్యకండి’ అన్నాడు.
అంతా విన్న తర్వాత ‘చూడు పూజా, అనవసరంగా నీ జీవితాన్ని పాడుచేసుకోవద్దు. అతను నీ ప్రేమను టైంపాస్‌గా భావించాడు. అలాంటి వాడి కోసం నువ్వు ఇలా బాధపడుతున్నావు. కోరికోరి కష్టాలను కోరుకుంటున్నావు. అతన్ని పెండ్లి చేసుకోవడం వల్ల నీకు బాధలే తప్ప సుఖం ఉండదు. జీవితం మొత్తం పోరాడుతూనే ఉండాలి. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో. నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి కచ్చితంగా నీ జీవితంలోకి వస్తాడు. మేము నీ మంచికోసమే చెబుతున్నాం’ అని ఎంతగానో చెప్పాము.
చివరకు ‘మేడమ్, మీరు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. నేను ఇంకా మొండిగా ఉంటే మీరు చెప్పినట్టు నేను మూర్ఖురాలినే అవుతాను. అతన్ని మర్చిపోయి నా బతుకు నేను బతుకుతాను. నా చెల్లి, తమ్ముడిని చక్కగా చదివిస్తాను’ అంటూ వెళ్లిపోయింది.
– వై వరలక్ష్మి,
9948794051



