ఉత్పత్తి పెంపునపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఆందోళనలతో గ్యాస్, చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. ప్రస్తుతం దేశంలో కేవలం 30 రోజులకు సరిపడ గ్యాస్ నిల్వలు మాత్రమే ఉండటంతో కేంద్ర ప్రభుత్వంలో గుబులు మొదలయ్యింది. ఈ క్రమంలోనే దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను కేంద్రం ఆదేశించింది. గ్యాస్ తయారీకి వాడే ప్రొపేన్, బ్యూటేన్‌లను పెట్రో కెమికల్ రంగానికి మళ్లించకుండా కేవలం వంటగ్యాస్ కోసమే వాడాలని స్పష్టం చేసింది.
ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లకు మాత్రమే విక్రయించాలని.. తద్వారా దేశీయ వినియోగదారులకు నిరంతర సరఫరా జరిగేలా చూడాలని సూచించింది. భారత్ ఎల్‌పీజీ అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ అనిశ్చితి వల్ల సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 32 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుందని ఇటీవల పలు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.



