Monday, April 6, 2026
E-PAPER
Homeజాతీయంఎల్పీజీ కష్టాలు

ఎల్పీజీ కష్టాలు

- Advertisement -

కిలో రూ.500కి చేరిక
భారంగా ‘ఛోటా’ సిలిండర్‌
పేదలు, వలస కార్మికులకు తప్పని తిప్పలు
బ్లాక్‌ మార్కెట్‌ దందాను కట్టడి చేయలేని ప్రభుత్వాలు

మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. దీని ప్రభావం 5 కిలోల ‘చోటు’ సిలిండర్‌పై పడింది. బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.400-500 వరకు అమ్ముడవుతోంది. దీంతో పేదలు, విద్యార్థులు, వలసకార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. బ్లాక్‌ మార్కెట్‌ దందా తీవ్రమైంది. కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు ఈ విషయంలో తీవ్రంగా విఫలమవుతున్నాయి.

న్యూఢిల్లీ : మధ్యప్రాచ్య యుద్ధం వల్ల ఎల్పీజీ సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. 14.2 కిలోల గృహ సిలిండర్‌ బ్లాక్‌ మార్కెట్‌లో రూ.3000 వరకు అమ్ముడవుతోంది. అధికార ధర మాత్రం రూ.914 మాత్రమే. 5 కిలోల సిలిండర్‌ రీఫిల్‌ ధర కిలోకు రూ.400-500కు పెరిగింది. ఈ పరిస్థితిలో చిన్న సిలిండర్‌ ధర పెద్దదాని కంటే ఎక్కువైంది. అందుకే ‘ఛోటా’ సిలిండర్‌ ఇప్పుడు ‘పెద్దది’గా మారిందని భావిస్తున్నారు. వలసకార్మికులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు ఈ ఐదు కిలోల సిలిండర్‌పై ఆధార పడుతుంటారు. కానీ ప్రస్తుత ధరల వల్ల రీఫిల్‌ చేయించడం మోయలేని భారంగా మారుతోంది. నోయిడాకు చెందిన పునీత్‌కుమార్‌ తన పాత ఐదు కిలోల చోటు సిలిండర్‌ను తిరిగి ఉపయోగించాలని భావించాడు. కానీ ఎల్పీజీ కొతర కారణంగా దాన్ని రీఫిల్‌ చేయించుకోలేకపోయాడు. ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో, సాధారణ 14 కిలోల సిలిండర్‌ కోసం వేచి ఉండడమే మంచిదనుకున్నాడు.

నోయిడాలోని రాహుల్‌ రంజన్‌ కూడా కిలోకు రూ.400 చెల్లించాలని అడిగారని చెప్పారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీలు) చట్టబద్ధంగా ‘చోటు’, ‘మినీ’, ‘అప్పు’ అనే ఐదు కిలోల సిలిండర్లను అందిస్తున్నాయి. కానీ వాటి లభ్యత సమస్యగా మారడం ఆందోళనకరమని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రభుత్వం సరఫరా నిలకడగా ఉంటుందని చెప్పినా.. చాలా చోట్ల పది నుంచి 45 రోజుల వరకు సిలిండర్‌ డెలివరీ ఆలస్యం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ కోసం ప్రజలు గొడవలకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న సిలిండర్‌పై ఆధారపడే వలస కార్మికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అధిక ధరల కారణంగా కొంతమంది తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. నోయిడాలోని ఒక స్ట్రీడ్‌ ఫుడ్‌ విక్రేత గ్యాస్‌ కొనలేక బొగ్గు స్టవ్‌కు మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ తర్వాత అతను స్వగ్రామానికి వెళ్లిపోయాడు. చిన్న సిలిండర్‌ ఒకప్పుడు మధ్యతరగతి వారికి గుర్తుగా ఉండేది.

ఇప్పుడు అదే పేదలకు జీవనాధారం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని పొందడం కష్టమైంది. ముంబయి, ఢిల్లీ వంటి నగరాల్లో చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు ఈ సిలిండర్లపై ఆధారపడుతుంటారు. కానీ ఇప్పుడు వాటి రీఫిల్‌ ధరలు అధికంగా ఉండటంతో వ్యాపారం కొనసాగించడం కష్టమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్‌ మార్కెట్‌ దందా సాగుతోంది. పోలీసులు బ్లాక్‌ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నా.. అక్రమ దందా మాత్రం ఆగటం లేదు. ప్రభుత్వం ఈ మినీ సిలిండర్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. వలస కార్మికులకు 30,000 సిలిండర్లు పంపిణీ చేశారు. మార్చి 23 తర్వాత 3.9 లక్షల సిలిండర్లు అమ్ముడయ్యాయి. అయితే ధర కూడా పెరిగి రూ.649కు ఎగబాకింది. ఈ సిలిండర్లు సులభంగా పొందవచ్చని కంపెనీలు చెప్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. చాలా చోట్ల అవి అందుబాటులో లేవని ప్రజలు చెప్తున్నారు. బుకింగ్‌ చేసినా స్టాక్‌ లేదని చెప్పడం, హెల్ప్‌లైన్‌ పని చేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -