Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగంపగుత్త ఓట్లకు గాలం

గంపగుత్త ఓట్లకు గాలం

- Advertisement -

కులసంఘాలతో, కాలనీ కమిటీలతో సమావేశాలు
ఓటరు లిస్టును జల్లెడ పడుతున్న అభ్యర్థులు
జాబితాల్లో అనుకూల, వ్యతిరేక ఓటర్ల గుర్తింపు
తటస్థ ఓటర్ల మచ్చికకు ప్లాన్‌

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడుతోంది. గత వారం రోజులుగా అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుండటంతో గంపగుత్త ఓట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆయా మున్సిపల్‌, కార్పొరేషన్‌ల్లో ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకోసం డివిజన్‌, వార్డుల్లో ఉన్న కులసంఘాలను, కాలనీ కమిటీలను మచ్చిక చేసుకునేందుకు పలువురు అభ్యర్థులు వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే దానితో పాటు భవిష్యత్తులో కులసంఘానికి, కాలనీ కమిటీలకు చేసే సాయంపై అనేక హామీలు గుప్పిస్తున్నారు. దీంతో పాటు తమ పరిధిలోని ఓటర్ల లిస్టులను జల్లెడ పడుతున్నారు. తమకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎంత మంది ఉన్నారో లెక్కలేసుకుంటున్నారు.

తటస్థ వైఖరితో ఎంత మంది ఓటర్లు ఉన్నారో గుర్తించి వారిని మచ్చిక చేసుకునేందుకు ప్లాన్‌ వేస్తున్నారు.నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో చతుర్ముఖ పోరు నెలకొనగా.. మిగతా మున్సిపాల్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. రెండేండ్ల కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలనే ప్రధానంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు, నాయకులు ప్రస్తావిస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా రేషన్‌కార్డు, సన్నబియ్యం అంశాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సైతం గట్టిగానే పోటీ ఇస్తున్నారు. ఇది వరకు చేసిన అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని, రెండేండ్ల కాలంలో కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లోని పలు డివిజన్‌లలో బీజేపీ అభ్యర్థులు విమర్శలు చేసుకుంటూ ప్రచారం చేపడుతున్నారు.

గంపగుత్త ఓట్లకు గాలం
ఒక వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు గంపగుత్త ఓట్లకు గాలం వేసేందుకు పలువురు అభ్యర్థులు వ్యూహాలు రచిస్తు న్నారు. కాలనీ డెవలప్‌మెంట్‌ కమిటీలతో, ఆయా చోట్ల కులసంఘాలతో సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆర్థిక పరమైన డిమాండ్‌లను అప్పటికప్పుడు నెరవేరుస్తూ ఇతర ప్రతిపాదనలు గెలిచిన తర్వాత తీరుస్తామని భరోసా కల్పిస్తున్నారు. దీంతో పాటు రెండు రోజులు సరిపడా మద్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఓటరు లిస్టు జల్లెడ
ఎన్నికల్లో ఏ అభ్యర్థికైనా పోల్‌ మేనేజ్‌ మెంట్‌ చాలా కీలకం. వారి డివిజన్‌/వార్డు పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో, ఏ ఓటరు ఎవరికి అనుకూలంగా ఉన్నారో గుర్తించడం ముఖ్యం. ఇందుకోసం పలువురు అభ్యర్థులు ఓటరు లిస్టును జల్లెడ పడుతున్నారు. తమ అనుచరులతో కలిసి తమకు అనుకూలంగా వచ్చే ఓట్లు, వ్యతిరేకంగా ఉన్న వారిని గుర్తించి ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గెలిచే అవకాశం ఉండి.. తీవ్ర పోటీ ఉన్న చోట ఎంత ఖర్చుపెట్టేందుకైనా అభ్యర్థులు సిద్ధపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -