‘తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల’ ముగింపు సభకు హాజరు
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ..
ముస్లిం-హిందూ పోరాటంగా చిత్రీకరణ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభకు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ హాజరుకానున్నట్టు ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఈ సభకు బేబీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఇతర నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సభకు అన్ని గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు, రెడ్‌షర్ట్ వాలంటీర్లు హాజరై విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తూ ముస్లిం- హిందూ పోరాటంగా చిత్రీకరిస్తోందని చెప్పారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేశ్, వై.విక్రమ్‌తో కలిసి నున్నా మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ చిట్యాల ఐలమ్మ వర్ధంతి రోజున ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నైజాం ప్రభుత్వం కూలిపోయి భారతదేశంలో విలీనమైన 17వ తేదీతో ముగుస్తాయన్నారు. ఆ రోజున నిర్వహించే ముగింపు సభకు ఎంఏ బేబీ హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.
హిందూ ముస్లిం పోరాటం కాదు.. వర్గ పోరాటం
ఫ్యూడలిజం, రాచరిక వ్యవస్థ, భూస్వామ్య దోపిడీపై తిరుగుబాటు చేసిన వర్గ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటమని నున్నా తెలిపారు. ఈ పోరాటంలో హిందువులే కాదు.. ముస్లింలు సైతం పాల్గొన్నారని, ముగ్దుం మొహినొద్దీన్, షోయబుల్లాఖాన్, బందగీ వంటి అనేక మంది ఈ పోరాటంలో అసువులు బాసారని తెలిపారు. ఈ చారిత్రక పోరాటం జరిగి సుమారు 77 సంవత్సరాలైందని, ఎప్పుడూ లేని విధంగా బీజేపీ దీనిపై సభలు నిర్వహిస్తూ చరిత్రను వక్రీరిస్తూ మతం రంగు పులమడం అత్యంత దుర్మార్గమన్నారు. హిందూ-ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ‘రజాకర్ల ఫైల్స్’ వంటి చిత్రాలను రూపొందించి తప్పుడు సంకేతాలు ఇస్తోందన్నారు. దీన్ని సీపీఐ(ఎం), వామపక్షాలు ఖండిస్తున్నాయన్నారు. నిజాం పాలనలోనూ హిందూ-ముస్లింలు కలిసి మెలిసి ఉన్నారని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జమీందారీ, జాగీర్దారీ, దేశ్‌ముఖ్‌ల దుర్మార్గాలకు వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి, వెట్టిచాకిరీ రద్దు చేయాలని, పన్నులు వేసి ప్రజలను పీడించే విధానం పోయి ప్రజాస్వామ్యం కావాలని కోరుతూ జరిగిన పోరాటమని తెలిపారు.
చిట్యాల ఐలమ్మ పోరాటం.. దొడ్డి కొమరయ్య అమరత్వం తర్వాత సాయుధ పోరాట రూపం తీసుకుందని, దీనికి పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, అరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి అనేక మంది యోధులు ఈ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఫలితంగా పది లక్షల ఎకరాల భూములు పేదలకు పంచారని, నాలుగువేల గ్రామాల్లో వెట్టిచాకిరీ రద్దయిందని తెలిపారు. జమీందారు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టి ప్రజాపాలన వచ్చిందన్నారు. ఈ పోరాట ఫలితంగానే భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమైందని తెలిపారు. కొందరు దీన్ని వక్రీకరించి పటేల్ సైన్యాలు రావటంతోనే నైజాం ప్రభువును లొంగదీసుకున్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. లక్షల మంది జైళ్ల పాలయ్యారని, అనేక హత్యలు, లైంగికదాడులు, సామూహిక హత్యాకాండలు జరిగాయని వివరించారు. ఈ పోరాటంలో ఏ ఒక్కచోట బీజేపీ కార్యకర్త ప్రమేయం లేదని స్పష్టంచేశారు. బీజేపీ చేస్తున్న ఈ విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈ సభ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దేశంలో భూసంస్కరణలు, కౌలుదారీ వంటి అనేక చట్టాలు వచ్చాయంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే కారణమన్నారు. అంతటి మహత్తర పోరాటాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తుండటాన్ని ఖండించారు. 17న నిర్వహించే సభ ద్వారా ఈ విషయాలన్నింటినీ మరోసారి ప్రజలముందుంచుతామని తెలిపారు.