తెలంగాణ విప్లవ పోరాటాల గడ్డ. దానికి ఖమ్మం లాంటి జిల్లా గుమ్మమే. ఏ పల్లెను తడిమినా పోరాట ఊసులు చెబుతాయి. ఏ గడప మీటినా కన్నీటి కథలే వినిపిస్తాయి. సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా వాసులది ప్రత్యేక చరిత్ర. ఉమ్మడి జిల్లా అంతటా అడవులు, కొండలు, పచ్చని ప్రకృతి ఆవరించి ఉన్నట్టుగానే విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం ఇక్కడ విస్తరించింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడారు, ప్రాణాలను సైతం పణంగా పెట్టారు.ఆ పోరాటంలో మడమ తిప్పని తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సీపీఐ(ఎం) నేత కామ్రేడ్ మచ్చా వీరయ్య. ఆయన ఖమ్మం ఏరియా దళ నాయకుడిగా నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది. జన్మస్థలం ఖమ్మం -కోదాడ జాతీయ రహదారిపై ఖమ్మానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముదిగొండ మండలంలోని చిన్న గ్రామం గోకినపల్లి. ఈ గ్రామానికి చాలా ప్రాధాన్యత ఉంది.
ఒకచేత తుపాకీ, మరోచేత కలం పట్టి పోరాడిన ‘తెలంగాణ మాతృ గీతం’ రచయిత రావెళ్ల వెంకట రామారావు కూడా మచ్చా వీరయ్య సహచరుడే. ఈ గ్రామం నుండి యరమనేని వెంకటనర్సయ్య, రావెళ్ల సత్యం, పయ్యావుల లక్మయ్య, వాసిరెడ్డి లింగయ్య,పమ్మి నాంచారయ్యలు వీరయ్య పోరాట దళంలో సభ్యులుగా ఉన్నారు. కేవలం 33ఏళ్ల చిరు ప్రాయం లోనే వీరమరణం పొందిన భారత విప్లవోద్యమ చరిత్రలో ఆయన స్థానం చెరగనిది. మచ్చావీరయ్య తొలుత సామాజిక ఉద్యమకారుడిగా గ్రామాల్లో ఉన్న కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. దొరల దోపిడీని నిలదీశాడు.ప్రజల దైనందిన సమస్యల్లో బాగం పంచుకుంటూ తన ఇల్లునే గ్రంథాలయంగా మార్చి ఆ ఉద్యమంలో భాగమయ్యాడు. ఊరూరా గ్రంథాలయాలు, రాత్రిబడులు ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్య పరిచారు.ఆయన మేనమామ కమ్యూనిస్టు నేత రావెళ్ల జానకి రామయ్య ప్రభావంతో 1943లో ఆంధ్రమహాసభ కార్యకర్తగా మారడంతో పాటు రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఖమ్మం ఆంధ్రమహాసభ విజయవంతం కోసం అహర్నిశలు కృషిచేశారు.
1946వరంగల్ ఆంధ్ర మహాసభ నాటికి ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా సైతం ఎన్నికయ్యారు. క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు కార్యకర్తగా ఆనాడు ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపునందుకొని మద్యనిషేధం అమలు కోసం పోరాటం చేశాడు. జైలుజీవితం గడిపారు.ఆ తర్వాత ఆనాటి తీవ్ర కరువు పరిస్థితిలో అనుచరులతో కలిసి ప్రజలు ఆకలిచావులు చావకుండా ఊరూరా గంజి కేంద్రాలు నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్దం వలన ఇనుప ఖనిజ సమస్య ఏర్పడింది. రైతులకు బండి పట్టాల కోసం, నాగేటి కర్రుల కోసం ఉద్యమం చేసి లాఠీదెబ్బలు తినడంతో పాటు, పద్దెనిమిది మాసాలు మహబూబాబాద్ జైలులో నిజాం ప్రభుత్వం నిర్బంధించింది. జైలు నుండి విడుదల అయిన మచ్చా వీరయ్య నైజాం, రజాకార్ల దాడులను ఎదిరించడానికి అప్పట్లో తెలంగాణా సరిహద్దు ఆంధ్ర గ్రామం అయిన మల్కాపురంలో ఎంపిక చేసిన వందమంది అనుచరులకు శిక్షణ ఇచ్చారు. మచ్చా వీరయ్య కర్ర సాధనంలో దిట్ట. తనకు వచ్చిన కర్ర తిప్పడంతోపాటు, తుపాకీ కాల్చడంలో శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన వందమంది సాయుధ అనుచరులతో కలిసి గ్రామాల్లో జైత్రయాత్ర జరిపారు.
మొదటిసారి వందగ్రామాల్లో వడ్డీ పత్రాలు,నాగు దస్త్రాలు దగ్ధం చేయడంతో పాటు, పటేలు, పట్వారీల దోపిడీని ఎదిరించాడు. వెట్టిచాకిరి రద్దు ప్రకటన చేశారు.మరోపక్షం రోజుల్లోనే మరోసారి వందగ్రామాలలో ఆయన జైత్రయాత్ర పేరుతో ప్రజలతో కలిసి గ్రామాల్లో ఉన్న దొరలను తరిమి వేయడంతో పాటు, వేలాది ఎకరాల భూములు పేదలకు పంచారు. ఈ సమయంలో రహస్యంగా ఉండి ఉద్యమం చేస్తున్న మచ్చా వీరయ్య గోకినపల్లిలోని ఇంటిపై రజాకార్లు సాయుధ బలగాలతో మూడుసార్లు దాడిచేశారు. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాల్లో మూత్రం పోయడం లాంటి అకృత్యాలు చేశారు.అయినా మడమ తిప్పని పోరాట యోధుడుగా మచ్చా వీరయ్య తాను సాయుధ దళాలతో నైజాం పోలీసులు, రజాకార్లపై మాటు దాడులు చేసి గ్రామాలనుండి తరిమి వేశారు. 1948 సెప్టెంబర్ 17న నైజాం రాజుతో సంది కుదిరి నైజాం ప్రాంతం భారత యూనియన్ లో విలీనం అయ్యింది. గ్రామాల నుండి పారిపోయిన దొరలు, పటేలు, పట్వారీలు కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామాల్లోకి అడుగు పెట్టారు.
ప్రజలకు పంచిన భూముల రక్షణ కోసం మచ్చా వీరయ్య సాయుధ పోరాటం విరమణకు ఇష్టపడలేదు. ఖమ్మం డివిజన్‌లోని పిండిప్రొలు, కాశిరాజుగూడెం అడవులను స్థావరంగా చేసుకొని అష్టకష్టాలు పడుతూ ప్రజలకు రక్షణగా నిలిచారు.యూనియన్ సైన్యాలు ఆయన్ను నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. వీరయ్య దళం గోకినపల్లి, ఆరెగూడెం మధ్యవాగులో, జొన్న చేలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఓ ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు యూనియన్ సైన్యాలు చుట్టుముట్టాయి. దళం తప్పించుకుంది. కానీ మచ్చావీరయ్యతో పాటు మరో విప్లవ సహచరుడు వెలగపూడి కృష్ణమూర్తి నిరాయుధులుగా పట్టుబడ్డారు. యూనియన్ సైన్యం వారిరువురిని చిత్రహింసలు పెట్టి అక్కడికక్కడే తుపాకీతో కాల్చివేసింది. 1949 జనవరి 17న జరిగిన ఈ ఘటన నేటికి డెబ్బయి ఏడేండ్లవుతోంది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య తన ”తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట అనుభవాలు -జ్ఞాపకాలు” పుస్తకంలో మచ్చా వీరయ్య వీరోచిత చరిత్రను ప్రస్తావించారు. ఆయన పేరుతో సీపీఐ(ఎం) పార్టీ గోకినపల్లిలో మార్క్సిస్టు అధ్యయన కేంద్రం, స్థూపాన్ని నిర్మించింది. ప్రతియేటా స్థానిక ప్రజలు ఆయన పోరాట స్మృతులకు గుర్తుచేసుకుంటారు.
ఎన్.తిర్మల్
9441864514



