Sunday, October 26, 2025
E-PAPER
Homeనెమలీకమాయా కాగితం

మాయా కాగితం

- Advertisement -

రోజర్‌ ఐదో తరగతి చదివే విద్యార్థి. రోజర్‌కు వాళ్ళ అమ్మానాన్నలతో ఎప్పుడు, ఎలా గడిపాడో తన బాల్యం తనకు గుర్తులేదు. తన బాల్యమంతా ఇంట్లో పనులన్నీ చేసి పెట్టే పెద్దమ్మే కనిపించేది. ఆ పెద్దమ్మ రోజర్‌ వాళ్ళ ఇంట్లో పనిమనిషి. ప్రతిరోజూ పాఠశాలకు రెడీ చేయడమూ, తనే పాఠశాలకు తీసుకువెళ్లడం, మధ్యాహ్నం లంచ్‌ తీసుకొచ్చి భోజనం తినిపించి వెళ్లడం, సాయంత్రం మళ్ళీ పాఠశాల నుండి ఇంటికి తీసుకు వెళ్ళడమూ పెద్దమ్మే చేసేది. అందుకే తన బాల్యమంతా పెద్దమ్మే కనిపిస్తుంది అని స్నేహితులతో ఎప్పుడూ చెప్తూ బాధపడేవాడు రోజర్‌.

నగరంలో ఉండే రోజర్‌ అమ్మానాన్నలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఏ రాత్రికో వచ్చేవారు. ఒక్కొక్క రోజు వారు వచ్చేసరికి రోజర్‌ నిద్రపోతుండేవాడు. పాఠశాల సంగతులన్నీ అమ్మానాన్నలతో పంచుకోవాలని ఆశగా ఎదురుచూసే రోజర్‌కు ఎప్పుడు నిరాశే ఎదురయ్యేది. స్కూల్లో కూడా తన పేరెంట్స్‌ గురించే ఆలోచిస్తూ కూర్చునేవాడు. అలా చదువుపై శ్రద్ధ కూడా తగ్గింది. ఒకరోజు ఎవరో విద్యార్థి నాయకులు వచ్చి ‘ఈరోజు పాఠశాలకు సెలవు’ అని లాంగ్‌ బెల్‌ కొట్టించారు. విద్యార్థులందరూ తమ తమ బరువైన బ్యాగులను భుజాలకు తగిలించుకొని ఇంటిదారి పట్టారు. రోజర్‌ కూడా పాఠశాల నుండి బయటికి వచ్చి, పక్కనే ఉన్న ఒక పార్కులో నిరాశగా కూర్చుని తల్లిదండ్రుల గురించే ఆలోచించసాగాడు. ‘ఇంటికి వెళితే పెద్దమ్మ ఉంటుంది. ఆమె పనిలో బిజీగా ఉంటుంది. అమ్మా నాన్న ఉండరు’ అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు.

చెట్టు మీద నుండి అకస్మాత్తుగా ఒక నల్లని కాగితం రోజర్‌పై పడింది. ‘ఏంటా’ అని చేతిలోకి తీసుకొని చూశాడు. ”ఏంటి రోజర్‌.. ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నావు. ఏదో బాధలో ఉన్నావు?” అని కాగితం మాట్లాడింది. రోజర్‌ ఆశ్చర్యపోయాడు. ”ఇదేంటి కాగితానికి కూడా మాటలు వస్తాయా” అని అన్నాడు. ”ఓ..ఎందుకు రావు. నేను మాయా కాగితాన్ని నాకు మాటలు వచ్చు. నీలా ఎవరైనా బాధపడుతుంటే వెళ్లి వాళ్ళ బాధలు తీరుస్తాను. నీకు ఏమైనా బాధలు ఉంటే చెప్పు తీరుస్తాను” అన్నది కాగితం. ”నిజంగా నా బాధను తీర్చగలవా?” అని అమాయకంగా అడిగాడు రోజర్‌.

”ఓ ..కచ్చితంగా తీరుస్తాను”.
”మా అమ్మా నాన్న ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. నేను నా చిన్నతనం నుండి వాళ్లతో ఎప్పుడు గడిపానో.. ఎలా గడిపానో కూడా గుర్తులేదు. మా ఇంట్లో ఉండే పెద్దమ్మే నాకు అన్నీ చేసి పెడుతుంది. కానీ నాకు మా అమ్మా నాన్నలతో గడపాలని ఉంటుంది. వాళ్లేమో ఉదయం లేవగానే ఆఫీసుకు వెళ్తారు. రాత్రి ఎప్పుడో వస్తారు. వారు వచ్చేసరికి నేను నిద్రపోతాను. నాకు వారితో గడపాలని ఉంది” అని రోజర్‌ అన్నాడు.
అది విన్న మాయా కాగితం ”బాధపడకు రోజర్‌. ఇప్పుడే వెళ్లి నీ సమస్యను పరిష్కరిస్తాను” అని గాలిలో ఎగురుకుంటూ వెళ్ళింది.

ఆఫీసులో పనిచేస్తున్న రోజర్‌ వాళ్ళ తల్లి పని చేసే కంప్యూటర్‌ స్క్రీన్‌కు అతుక్కొని రోజర్‌ చెప్పిన విషయాలన్నీ వీడియో రూపంలో చూపించింది. తల్లి చాలా బాధపడింది.
”ఎవరు నువ్వు? ఏంటి ఇదంతా?” అని ప్రశ్నించింది. జరిగిన సంగతిని అంతా చెప్పింది మాయా కాగితం. ఆరోజు త్వరగా ఇంటికి చేరుకుంది. రోజర్‌తో గడిపింది. ఆఫీస్‌ నుండి తన భర్త రాగానే, మాయా కాగితం చెప్పిన విషయాలన్నీ చెప్పింది.
”మరి ఎలా? ఏం చేద్దాం” అని ప్రశ్నించాడు.
”నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపటి నుండి ఇంటివద్దే ఉండి రోజర్‌ను చూసుకుంటాను. వాడితో గడుపుతాను. వీలైతే వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తాను” అని చెప్పింది. రోజర్‌ తండ్రి సంతోషించాడు.
ఉదయం నిద్ర లేచిన రోజర్‌ ”ఏంటి అమ్మా! నువ్వు ఆఫీసుకు వెళ్లలేదా? అని అడిగాడు.

”లేదు నాన్నా. ఈరోజు నుండి ఆఫీసుకు వెళ్లట్లేదు. నీతోనే ఉంటాను. నువ్వు ఇంటికి వచ్చాక ఎంచక్కా ఆడుకుందాం, చదువుకుందాం” అని చెప్పింది తల్లి. సంతోషంతో తల్లిని గట్టిగా హత్తుకున్నాడు రోజర్‌. పాఠశాలకు వెళుతూ మాయకాగితం కోసం చెట్టుకిందికి చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన కాగితం ”హాయ్ రోజర్‌! నీ సమస్య పరిష్కారం అయిందా?” అని అడిగింది.
”అవును. చాలా థాంక్యూ ఫ్రెండ్‌. అని చెప్పి సంతోషంగా పాఠశాలకు పరిగెత్తాడు. మాయ కాగితం మరొకరి సమస్యను తీర్చడానికి సంతోషంగా గాల్లో ఎగురుతూ వెళ్ళింది.

  • ముక్కామల జానకీరామ్‌, 6305393291
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -