ఇసుకాసురులపై చర్యలు తీసుకున్న ఐపీఎస్ అధికారిణికి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బెదిరింపులు
సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్
ముంబయి : మహారాష్ట్రలోని అధికార మహాయుతి సర్కారు ఇసుక అక్రమార్కులకు వత్తాసు పలుకుతోంది. ఇసుకను అక్రమంగా తవ్వుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారిని.. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బెదిరించటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణను ఫోన్లో బెదిరిస్తూ ఆయన జరిపిన మాటలకు సంబంధించిన ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఆడియోపై స్పందించిన నెటిజన్లు.. మహాసర్కారు తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వివరాళ్లోకెళ్తే.. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకునేందుకు రెండ్రోజుల క్రితం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. తనకు ఫోన్ చేసింది ఉపముఖ్యమంత్రే అని నమ్మకం కలగని ఆ అధికారిణి.. తన నంబర్‌కు ఒకసారి వీడియో కాల్ చేయాలని తెలిపింది. ఆమె మాటలతో ఆగ్రహానికి గురైన అజిత్ పవార్.. ‘నీకు ఎంత ధైర్యం, నేను నీపై చర్యలు తీసుకుంటా.. నన్నే వీడియోకాల్ చేయమంటావా.. నన్ను చూడాలనుకుంటున్నావుగా.. నాకు వీడియో కాల్ చెరు..’ అని పవార్ ఆదేశించారు. దీంతో పవార్‌కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారగా.. పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
అక్రమార్కులకు ‘మహా’ సర్కారు అండ
- Advertisement -
- Advertisement -