Monday, September 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమనువాదంపై మహోద్యమమే జాషువాకు నివాళి

మనువాదంపై మహోద్యమమే జాషువాకు నివాళి

- Advertisement -

కె. ఆనంద చారి, టి స్కైలాబ్‌ బాబు, భూపతి వెంకటేశ్వర్లు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మనువాదంపై మహోద్యమమే జాషువాకు నిజమైన నివాళి అని తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి కె ఆనంద చారి, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు ఆదివారం గుర్రం జాషువా130వ జయంతి సందర్భంగా కెేవీపీఎస్‌, తెలంగాణ సాహితీ, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కేవీపీఎస్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు ఎం.కృపాసాగర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై ఉన్న జాషువా విగ్రహం వద్ద సభ నిర్వహించారు. వేల ఏండ్లుగా వేళ్లూనుకుని ఉన్న కుల, మత అసమానతలపై అక్షరయుద్ధం చేసిన నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా అని వారు పేర్కొన్నారు. సామాజిక న్యాయాన్ని సమతా భావాన్ని నిర్మించిన మహాకవి జాషువా చిరస్మరణీయుడని తెలిపారు. తొలుత జాషువా విగ్రహానికి ఆనందచారి, స్కైలాబ్‌ బాబు, భూపతి వెంకటేశ్వర్లు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక, సాహిత్య రంగంలో జాషువా కవిత్వం ఓ చైతన్య స్ఫూర్తి అని తెలిపారు.

కుల, మత బేధాలు పేదరికం తన గురువుగా భావిస్తున్నానని చెప్పిన జాషువా వాటి మూలాలపై కలం యుద్ధం చేశారని పేర్కొన్నారు. కర్మ సిద్ధాంతం పేర కోట్లాదిమంది కష్టజీవులను అణిచివేత, దోపిడీకి గురిచేసిన మనువాద విష సంస్కృతిపై మహోద్యమం నిర్మించాడని చెప్పారు. పాములకు పాలు పోసి, చీమలకు పంచ దార చల్లే మనుషులున్న ఈ జగాన పేదవాడికి గంజి నీళ్లు కూడా ఇవ్వరని తన కవిత్వం ద్వారా నిరసించాడని తెలిపారు. సామాజిక అసమానతలకు మూల కారణమైన సిద్ధాంతానికి ప్రతినిధులుగా ఉన్నవాళ్లు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నారని వారు ఈ సందర్భంగా పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఏ. విజయ్ కుమార్‌, తెలంగాణ సాహితీ రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్‌ కృష్ణ, ఎస్‌.కె.సలీమ, శరత్‌ సుదర్శి, కేవీపీఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర కార్యదర్శి బి.సుబ్బారావు, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శులు ఎన్‌ బాల పీరు, నాయకులు డి. రమేష్‌ , జి.రాములు, జి.విజయ్ కుమార్‌, బి.పవన్‌, సోమయ్య, సురేష్‌, విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -