Tuesday, October 28, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'మహాగట్‌' సవాల్‌

‘మహాగట్‌’ సవాల్‌

- Advertisement -

బీహార్‌ శాసనసభ ఎన్నికలను ఎదుర్కొంటున్న ఇండియా బ్లాక్‌ (మహా గట్‌బంధన్‌) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను ఏకాభిప్రాయంతో ప్రకటించి అధికార జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయేకి తిరుగులేని సవాల్‌ విసిరింది. అంతేకాదు, ఎన్నికలకు ముందుగానే తమ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాశ్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (విఐపి) అధ్యక్షుడైన ముఖేష్‌ సహాని పేరును సైతం ప్రకటించి ఎన్నికల సమరానికి సై అంది. ఇండియా బ్లాక్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంతకాలం ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌లో ఐక్యత లేదంటూ బీజేపీ, జేడీయూ దళం లంకించుకున్న ప్రచారాన్ని తిప్పికొట్టినట్లయింది. మహా గట్‌బంధన్‌ ఇచ్చిన షాక్‌తో ఎన్డీయే పరిస్థితి గుక్కతిప్పుకోలేకుండా ఉంది. తమ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ఎలాంటి ఇబ్బందులూ లేవని డాంబికాలు పలుకుతున్న ఎన్డీయే తమ సీఎం అభ్యర్థి ఎవరో ఎన్నికల అనంతరమే ప్రకటిస్తామని బీజేపీ, అమిత్‌షా దాటవేస్తూ వచ్చారు. జేడీయూ చీఫ్‌, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో ఎన్డీయే ఎన్నికలకు వెళుతోందని అంటూనే, ఈ సారి నితీష్‌ సీఎం అవుతారన్న గ్యారంటీ లేదని చెప్పకనే చెప్పారు. దీన్నిబట్టి నితీష్‌ మెడపై బీజేపీ కత్తి వేలాడతీసిందని అర్థమవుతుంది.
బీహార్‌లో గత దశాబ్దంన్నరలో నితీష్‌ వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. పదవే లక్ష్యంగా కూటములు ఫిరాయించిన చరిత్ర ఆయన స్వంతం. ఆయన విధానాన్ని బీజేపీ అందివచ్చిన ప్రతిసారీ వల వేసి ఉపయోగించుకుంది. 2020 అక్టోబర్‌-నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత బీజేపీ పంచన చేరి నితీష్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పార్టీ తనను ఇబ్బంది పెడుతోందని పదవికి రాజీనామా చేసి మహా గట్‌బంధన్‌ వైపు వచ్చి తిరిగి సీఎంఅయ్యారు. రెండేళ్లన్నా గడవక ముందే, సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముంగిట 2024 జనవరిలో ఎన్డీయే తీర్థం పుచ్చుకొని పదవి కాపాడుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కావాల్సిన సీట్లు తగ్గగా తన సీట్లతో భుజం కాసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ పార్టీకి బిజెపి కంటే తక్కువ సీట్లచ్చినా ఆయన్నే సిఎం కుర్చీలో కూర్చోబెట్టామంటున్న బీజేపీ పస్తుత ఎన్నికల్లో తన గొంతును సవరిస్తోంది. మొత్తం 243 సీట్లలో బీజేపీ,జేడీయూ చెరో 101 పోటీ చేసి, తతిమ్మా స్థానాలను తమ పార్టనర్లకు కేటాయించాయి. కూటమి విస్తృత ప్రయోజనాల కోసం తాము గతంలో పోటీ చేసిన సీట్ల కంటే ఇరువురం దిగొచ్చి తగ్గించుకున్నామని బీజేపీ చెబుతున్నదాంట్లో నిజం కనిపించదు. రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ జేడీయూను మింగేసి ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తోందని కొన్నేళ్ల బీహార్‌ రాజకీయ పరిణామాలను బట్టి తెలుస్తుంది. బీజేపీ ఈ నైజం పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రుజువైంది. అందుకు తార్కాణం మహారాష్ట్రనే. సిఎం ఏక్‌నాథ్‌ షిండే (శివసేన గ్రూపు) నేతృత్వంలో ఎన్‌డిఎ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ.. బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో సీఎం పదవిని బీజేపీ తీసుకొని కూటమి పొత్తు ధర్మానికి నీళ్లదిలింది. అటువంటిదే బీహార్‌లో నితీష్‌ విషయంలో బీజేపీ చేయదని గ్యారంటీ లేదు.
బీహార్‌లో గెలిచేందుకు బీజేపీ తొక్కని అడ్డదార్లు లేవు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి ప్రత్యేక ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్‌)ను ప్రయోగించింది. ఈ.సి కి ఎంతమాత్రం సంబంధం లేని పౌరసత్వ నిర్ధారణ అంశాన్ని చేర్చేలా పావులు కదిపింది. దీనిపై ప్రతిపక్షాలు సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఏకంగా 65 లక్షల ఓట్లు తొలగించారు. దీనిపై విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించినా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ లేదు. ఓట్ల చోరీపై మహా గట్‌బంధన్‌ పెద్ద ఆందోళనే చేసింది. రెండు దశల ఎన్నికల్లో అభ్యర్ధుల నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో తుది గడువు ముగిసింది. మహా గట్‌బంధన్‌కు సంబంధించి 11 సీట్లలో స్నేహపూర్వక పోటీలు కొనసాగుతున్నాయి. నితీష్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని ఇప్పటికే ముందస్తు సర్వేలు చెప్తున్నాయి. రాజ్యాంగ విధ్వంసానికి, నిరంకుశత్వాన్ని పాదుకొల్పుతున్న బీజేపీని నిలువరించడం అత్యవసరం. బీహార్‌లో బీజేపీ, దాని మిత్రులను ఓడిస్తేనే కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ మతతత్వ-కార్పొరేట్‌ విధానాలకు కొంత మేరకైనా బ్రేకులు పడతాయి. ఆ లక్ష్య సాధన కోసం తమలోని చిన్న చిన్న ఇబ్బందులను పరిష్కరించుకొని మహా గట్‌ బంధన్‌ పని చేయాలని రాజ్యాంగ ప్రేమికులు, ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -