– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ఆర్టీసీని రక్షించుకుంటామని వ్యాఖ్య
– యూనియన్ల విషయమై పరిశీలిస్తున్నాం : పొన్నం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మీని చేపట్టామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ బస్సులను శాసనసభకి రప్పించి మహాలక్ష్మీ పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ‘మా ఆర్టీసీనీ రక్షించుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రతినెలా ఆ సొమ్ములు చెల్లించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పట్లో సూచించారు. నెల నెలా ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఇతర వివరాలను ఆర్థికశాఖకి పంపించినట్టు చెప్పారు. ఆర్థికశాఖ ఆర్టీసీకి డబ్బులు చెల్లించిందని గుర్తు చేశారు. మహిళలు దాదాపు 300 కోట్ల సార్లు ప్రయాణించి రూ. 10 వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని అభినందించారు. పేద మధ్యతరగతి కుటుంబాల ప్రయోజనాలు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మూలంగా ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌లో మీరు ప్రయాణం చేసిన నగదు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుందని గుర్తు చేశారు. వడ్డీలేని రుణాలు ఏడాదికి రూ.20 వేల కోట్లు బ్యాంకు లింకేజీతో ఇప్పించడం జరుగుతుందన్నారు. సంవత్సరానికి లక్ష కోట్లు మహిళలకు ఇప్పిస్తామన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేననీ, ఇందిరమ్మ ప్రభుత్వం చేసి చూపిస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికే రూ. 57 వేల కోట్ల బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలకు అందించామని ప్రకటించారు. వచ్చే మూడేండ్ల ల్లో రూ. లక్ష కోట్ల టార్గెట్‌ను మహిళలకు దాటిస్తామన్నారు. అవి రూ1.50 లక్షల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని గుర్తుచేశారు. మహిళలకు లక్ష కోట్లకి చెల్లించాల్సిన వడ్డీ చెల్లిస్తున్నానీ, మేము ఇప్పటికీ రూ. 3800 కోట్లలో రూ. 1000 కోట్లు వేయి కోట్లు చెల్లించడం, బడ్జెట్‌లో రూ. 2800 కోట్లు పెట్టామని వివరించారు. వచ్చే ఐదేండ్లకాలం లో రూ, 10 వేల కోట్లు మహిళలకు వడ్డీ చెల్లిస్తామని హామీనిచ్చారు. మహిళల ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందనీ, దీనిపై ఎలాంటి కఠిన నిర్ణయాలనైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మహిళలకు స్వయం సహాయక సంఘాల్లో చేర్పిస్తున్నామనీ, వారికి వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. వారికి సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి నిధులు ఇచ్చి, వ్యాపారస్థులను చేయడమే లక్ష్యమని వివరించారు. మహిళలందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామనీ, మంత్రి సీతక్క నేతత్వంలో అనేక కొత్త పథకాలు తీసుకొస్తున్నామని వివరించారు. మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశారు. సోలార్ పవర్ ప్లాంట్ ,పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబం, సమాజం ఆర్థికంగా బలోపేతమవుతుందని గుర్తు చేశారు.
48 గంటల్లోనే మహాలక్ష్మిని అమలుచేశాం : పొన్నం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటి వరకు 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి రూ.10 వేల కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు. మహిళా ప్రయాణికులే కాదు సీతక్క నేను డిప్యూటీ సీఎం కలిసి మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేయడం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన మహిళలకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి యాజమాన్యంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ముందుకు పోతున్నామన్నారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికుల్లో 40 మంది మహిళా ప్రయాణికులు 97 డిపోలు 35 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్నాయని అన్నారు. ఈ మహాలక్ష్మీ పథకం విజయవంతం అవడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు ప్రభుత్వం పక్షాన హదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. రాఖీ పండగ వచ్చిన కుటుంబ సభ్యులతో గడపకుండా ఆర్టీసీ డ్యూటీ చేస్తూ రికార్డు స్థాయిలో ప్రయాణికులను తరలించారన్నారు. ఇటీవల శాసనసభలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు. నియోజకవర్గాలవారిగా అవసరమైన కొత్త రూట్‌లు , కొత్త బస్సులు , బస్‌స్టేషన్ల అభివద్ధి పై నివేదిక తీసుకున్నామన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో 340 కొత్త రూట్‌లలో కొత్తగా బస్సులు నడపడం ప్రారంభించామని వివరించారు. రాష్ట్రంలో ప్రతి మూలాల్లో ఆర్టీసీ బస్సులు నడిపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. సీసీఎస్, పీఎఫ్ బకాయిలు తీరుస్తున్నామన్నారు. యూనియన్ల ఏర్పాటు, ఆర్టీసీ విలీనం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని గుర్తుచేశారు. మిగతా ఏ సమస్యలు ఉన్నా ఆర్టీసీ పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. 2018లోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చారనీ, మా ప్రభుత్వం కాదన్నారు. కొంత మంది యూనియన్ల పేరుతో కావాలని రెచ్చగొడుతున్నారని చెప్పారు. తెలంగాణకు ఆర్టీసీనే లైఫ్‌లైన్, దేశంలో రైల్వే కనెక్టివిటీ ఎక్కువ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఆర్టీసీ ఎండీ వి నాగిరెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఐఏఎస్ అధికారు శృతి ఓజా, సృజన తదితరులు హాజరయ్యారు.
మహాలక్ష్మితో మహిళలకు రూ.10 వేల కోట్ల ఆదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



