Saturday, April 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమక్కకు బస్తాల చిక్కు

మక్కకు బస్తాల చిక్కు

- Advertisement -

– సంచులు లేవనే సాకుతో కొన్నిచోట్ల సాగని కొనుగోళ్లు
– కేంద్రాల నిర్వాహకులను నిలదీస్తున్న రైతులు
– ఇండెంట్‌ పెట్టిన 48 గంటల తర్వాత వస్తాయంటున్న అధికారులు
– అరకొర కేంద్రాల్లోనూ కాంటాల్లో అలసత్వం
– నిరీక్షణ.. అకాల వర్షాల భయంతో ప్రయివేట్‌ విక్రయాలు
– ఎకరానికి రూ.30 వేల వరకూ నష్టపోతున్న రైతులు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రవ్యాప్తంగా పలు మార్క్‌ఫెడ్‌ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొరత ఏర్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అరకొరగా నెలకొల్పటంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా పంట విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ యాసంగిలో రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశారు. కానీ పంట పెరిగిన ప్రకారం.. కొనుగోలు కేంద్రాలు లేక.. ఉన్న చోట మూడు, నాలుగు రోజుల వరకూ గన్నీ బ్యాగులు సమకూర్చకపోవడంతో సెంటర్‌కు పంటను తీసుకొచ్చి ఎదురు చూడాల్సి వస్తోంది. బస్తాలు వచ్చాక ఒకేసారి కాంటాలు పెట్టేందుకు సరిపడా హమాలీలు ఉండటం లేదు. కేంద్రాల ఏర్పాటే ఆలస్యం అవుతుంటే బస్తాలు లేకుండా ఎందుకు తెరవడం? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తుండటంతో రోజుల తరబడి ఎదురు చూడలేక స్థానిక వ్యాపారులకు క్వింటా రూ.1700 చొప్పున అమ్ముకుంటున్నారు. ఇలా ఒక్కో ఎకరానికి రైతు రూ.25వేల నుంచి రూ.30 వేల వరకూ నష్టపోతున్నాడు.

మౌలిక వసతుల లేమి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రబీ సీజన్‌లో గతంలో గరిష్టంగా 90 వేల ఎకరాల్లో సాగు చేస్తే.. ఈ ఏడాది 2.43 లక్షల ఎకరాల్లో సేద్యం చేయడం గమనార్హం. బస్తాల కొరత కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోవటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో మార్కెట్‌ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల (బస్తాల) కొరత ఉండటం మొక్కజొన్న సేకరణకు ఆటంకం ఏర్పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 20, 2026 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఏప్రిల్‌ 20వ తేదీ తర్వాత నుంచి మొక్కజొన్న పంట అధిక మొత్తంలో చేతికి వస్తుందని, మే నెలలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభమవుతాయని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 250 కేంద్రాలను మార్క్‌ ఫెడ్‌ ప్రారంభించాలని నిర్ణయించింది. పంట విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా రెవెన్యూ గ్రామానికి ఒక సెంటర్‌ చొప్పున ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినవి చేయగా.. మిగిలిన సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తోంది.

రోడ్లెక్కుతున్న రైతులు
సరైన సమయంలో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో జగిత్యాల, కరీంనగర్‌ వంటి జిల్లాల్లో రైతులు జాతీయ రహదారులపై ధర్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బస్తాలు లేకపోవడం, గత ఏడాది నిల్వలు గోదాముల్లో అలాగే ఉండటంతో కొత్త పంటను కొనుగోలు చేయడానికి అధికారులు వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు స్పందిస్తూ పౌరసరఫరాల శాఖ నుంచి అదనపు బస్తాలను తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు తమ వద్ద ఉన్న పాత బస్తాలను వాడటానికి అనుమతి ఇవ్వాలని, లేదంటే వెంటనే కొత్త స్టాక్‌ పంపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బస్తాల కొరత లేదు..
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కలిపి మొత్తం 16 మార్క్‌ ఫెడ్‌ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మహబూబాబాద్‌ జిల్లాలో 16 కేంద్రాలు నెలకొల్పాం. కానీ బస్తాల సమస్య లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఇండెంట్‌ పెట్టిన 48 గంటల్లోపు బస్తాలు సమకూర్చుతాం. బచ్చోడు కేంద్రం ప్రారంభించి రెండు, మూడ్రోజులే అవుతున్న దృష్ట్యా వెంటనే బస్తాలను సమకూర్చి కొనుగోళ్లు సాగేలా చూస్తాం.
– శ్యాంకుమార్‌, మార్క్‌ ఫెడ్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా మేనేజర్‌

ఇటు నిరీక్షణ.. అటు మోసం
ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యమైన మొక్కజొన్న కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాల్‌కు రూ.2,225గా ఉంది. కొనుగోలు కేంద్రాలు సరిపడా లేకపోవటం.. అక్కడా వేగంగా కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వీరు నిబంధనలకు విరుద్ధంగా బస్తాకు 2.5 కిలోల నుంచి 5 కిలోల వరకు అదనంగా తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల బస్తాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు మొక్కజొన్నను సేకరించడం లేదు. దీనివల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాక్టర్లు, వాహనాలు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు ఆలస్యం కావడంతో, రైతులు గత్యంతరం లేక దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

బస్తాలు లేవని కాంటాలు పెట్టట్లేదు
బచ్చోడులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ మూడ్రోజులు అవుతోంది. కానీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. బస్తాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఒక రైతు దగ్గర లారీకి సరిపడా పంట ఉంది. ఇలా రోజుల తరబడి ఆలస్యం చేస్తే.. మొత్తం కొనుగోళ్లు ఎప్పటికి పూర్తయ్యేది? ఓ వైపు అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. తీరా బస్తాలు వచ్చాక రైతులంతా ఒకేసారి వస్తే హమాలీల సమస్య ఏర్పడుతుంది. చేతికొచ్చిన పంట అమ్ముకోవడం సమస్యగా మారింది. అధికారులు వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– కోట అశోక్‌ రెడ్డి, బీరోలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -