69 మంది మృతి… పలువురికి గాయాలు
రిక్టర్‌స్కేల్‌పై 6.9 శాతం తీవ్రత
మనీలా : ఫిలిప్పీన్స్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 6.9 తీవ్రత నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ఘటనలో 69 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం ధాటికి అనేక ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. బోగో నగరంలో అత్యధికంగా 14 మంది చనిపోయారు. ఈ నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అక్కడ మతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి దాన్బంటాయన్ సమీపంలో ఉన్న చారిత్రక రోమన్ కాథలిక్ చర్చి తీవ్రంగా దెబ్బతినట్టు అధికారులు వెల్లడించారు.
ఇండ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా 147 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. భూ ప్రకంపనల ధాటికి చాలా గ్రామాలు, పట్టణాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు బీటలు వారాయి. పర్వత ప్రాంతాలలో ఉన్న గ్రామాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ కొంతమంది మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకోవడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి రెస్క్యూ సిబ్బంది కృషి చేస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.బోగోకు దక్షిణంగా ఉన్న సాన్ రేమిజియో పట్టణంలో ఆరుగురు మరణించారు. వీరిలో ముగ్గురు కోస్ట్‌గార్డ్ సిబ్బంది, ఒక అగ్నిమాపక సిబ్బంది, ఒక చిన్నారి ఉన్నారని పట్టణ ఉప మేయర్ ఆల్ఫీ రేన్స్ తెలిపారు.
అయితే వీరు ఎలా మరణించారన్న వివరాలు వెల్లడించలేదు. పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతిందని, ఆహారం, నీరు తక్షణం అందించాలని రేన్స్ విజ్ఞప్తి చేశారు. అయితే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించిందని అగ్నిమాప సిబ్బంది రే కాన్యెట్ తెలిపారు. దీంతో బయటకు పరుగులు తీయగానే నేలమీద పడిపోయామని చెప్పారు. అగ్నిమాపక కేంద్రం తీవ్రంగా దెబ్బతిందని, ముగ్గురు గాయపడినట్టు చెప్పారు. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసిన ఫిల్పిప్పీన్స్ జియోలాజికల్ విభాగం ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. ఇటీవల రాగస తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే ఫిలిప్పీన్స్ వాసులు కోలుకుంటుండగా భూకంపం రూపంలో మరోసారి ప్రకృతి వారిపై విరుచుకుపడింది.ప్రకతి వైపరీత్యాలకు కేంద్ర బిందువు ఫిలిప్పీన్స్ ఫసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉన్నందున ఈ దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడం వంటివి జరగుతుంటాయి. ఏటా పదుల సంఖ్యలో తుపానులు సంభవిస్తుంటాయి.