నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాప్ మూసివేసే సమయంలో మంటలు చెలరేగడంతో సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
రెండు అంతస్తుల ఈ షోరూంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఒక్కొక్కటిగా పేలిపోవడం వల్ల బాంబులు పడుతున్నట్టు భారీ శబ్దాలు వినిపించాయి. భవనం ముందు పార్క్ చేసి ఉన్న సీఎన్‌జీ కారు కూడా మంటల్లో చిక్కుకుని పేలిపోవడంతో అగ్నికీలలు మరింత ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు చుట్టుపక్కల నివాసాలను ఖాళీ చేయించి, రహదారులను మూసివేసి భద్రతా ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



