Wednesday, November 19, 2025
E-PAPER
Homeక్రైమ్జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

– ఇద్దరు కార్మికుల సజీవ దహనం
– కార్మికుల ఆందోళన.. పోలీసుల మోహరింపు
– పరిశీలించిన ఎస్పీ జానకి
నవతెలంగాణ- జడ్చర్ల

జిన్నింగ్‌మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు సజీవ దహన మయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్‌ బాలాజీ జిన్నింగ్‌ మిల్లులో మంగళవారం జరిగింది. వెంటనే జిల్లా ఎస్పీ జానకి, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా భావిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఎస్పీ జానకి, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సలసర్‌ బాలాజీ జిన్నింగ్‌ మిల్లులో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. మంగళవారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరి గింది. మంటలు ఎగసిపడ్డాయి. మిల్లులోని దుమ్ము ధూళి బయటకు వెళ్లే పైపులైన్‌లో చెత్త ఇరుక్కుందని, దాన్ని తొలగించేందుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన పప్పు(26), బీహార్‌ రాష్ట్రానికి చెందిన హరేందర్‌(23) వెళ్లారు. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులిద్దరికీ ఇటీవలనే వివాహమైంది. ఈ ఘటనతో కార్మికులు మిల్లు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మోహరించారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియనుంది.

రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
బాలాజీ జిన్నింగ్‌ మిల్లు ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. కంపెనీలో పని చేసే కార్మికులందరూ అంతర్రాష్ట్ర కార్మికులేనని, వారికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌, క్యాంటీన్‌ సదుపాయం లేవన్నారు. కంపెనీ ఆవరణలో చిన్న చిన్న రేకుల షెడ్లు వేసి.. ఒక్కొక్క గదిలో 10, 12, మందిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 13, 14 సంవత్సరాల పిల్లలతోనూ పని చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రెండు మూడు సార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, మార్చి 4, 2025న కూడా ప్రమాదం జరిగిందని తెలిపారు. దాదాపు 350 నుంచి 400 మంది కార్మికులు పని చేస్తున్నారని అన్నారు. స్థానిక కార్మికులను ఇటీవల తొలగించారని తెలిపారు. కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -