నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ప్రధాన రహదారిపై ఉన్న ప్రముఖ ‘అను ఫర్నిచర్’ షోరూంలో మంటలు చెలరేగి, ఐదు అంతస్తుల్లోని ఫర్నిచర్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో షోరూం నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. షోరూంలో చెక్క, కుషన్లు వంటి తేలికగా మండే వస్తువులు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే ఐదు అంతస్తుల భవనం మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుంది.
దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే, అప్పటికే షోరూంలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు వాహనాలను వేరే మార్గాల్లో మళ్లించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



