Monday, July 14, 2025
E-PAPER
Homeక్రైమ్ముడి చమురు రైలులో భారీ అగ్ని ప్రమాదం

ముడి చమురు రైలులో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
చెన్నై :
తమిళనాడులో చెన్నై సెంట్రల్‌కు 43 కిలోమీటర్ల దూరంలోని తిరువల్లూర్‌ సమీపంలో ఆదివారం ఉదయం ముడి చమురును రవాణా చేస్తున్న రైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అనేక సబర్బన్‌, దూర ప్రాంత రైలు సర్వీసులను రద్దు చేయడమో లేదా నిలిపివేయడమో జరిగింది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నోర్‌ నుంచి జోలార్‌పెట్టరుకి ముడి చమురును రవాణా చేస్తున్న 45 బోగీల రైలు తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రమాదానికి గురైంది. తిరువల్లూర్‌-ఎగత్తూర్‌ సెక్షన్‌ మీదుగా వెళుతుండగా ఒక్కసారిగా రైలులో మంటలు వ్యాపించాయి. రెండు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగి ఉండవచ్చునని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.


మంటలు తొలుత నాలుగు బోగీలకు, ఆ తర్వాత అత్యంత వేగంగా ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో మంటలు ఎగిసిపడి ఆకాశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న వారు భయాందోళనలకు గురయ్యారు. వారందరినీ ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందుకోగానే అగ్నిమాపక సిబ్బంది, సహాయ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా ఐదు బోగీలను రైలు నుంచి వేరుచేశారు. ఘటనా స్థలం వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. తిరువల్లూర్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.ప్రతాప్‌ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. సహాయ చర్యల్లో భాగస్వాములయ్యేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని కూడా మోహరించారు.
ప్రమాదం నేపథ్యంలో చెన్నై -అరక్కోణం మధ్య సబర్బన్‌ రైలు సర్వీసులను రద్దు చేశారు. మంగళూర్‌ మెయిల్‌, నీలగిరి ఎక్స్‌ప్రెస్‌, కోయంబత్తూర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. చెన్నై -మైసూర్‌ శతాబ్ది, చెన్నై -బెంగళూరు డబుల్‌ డెక్కర్‌ సహా చెన్నై సెంట్రల్‌ నుంచి బయలుదేరాల్సిన రైళ్లనన్నింటినీ రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను గూడూరు, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. రైళ్ల రాకపోకల సమాచారం కోసం 044-25354151, 044-24354995 హెల్ప్‌లైన్‌ నెంబర్లను సంప్రదించాలని దక్షిణ రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -