నవతెలంగాణ – అశ్వారావుపేట : గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన, మెరుగైన చికిత్సలతో కూడిన వైద్యం అందడం అరుదనే చెప్పాలి. కానీ అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రిగా ఉన్నతి చెందాక పట్టణ స్థాయి వైద్యం అందుతుండడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వినాయకపురం వాసి కోడె వీరాస్వామి భార్య కోడె లక్ష్మిని కాన్పు నొప్పులతో గురువారం అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రికి తీసుకు వచ్చారు.
విధుల్లో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక లక్ష్మీని పరీక్షించి, చికిత్స ప్రారంభించారు. సాధారణ కాన్పు రాకపోవడం ఎల్.ఎస్.సీ.ఎస్ (లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్) అత్యవసర శస్త్ర చికిత్స( ఆపరేషన్) చేసి ఇద్దరు కవలలకు పురుడు పోశారు. వీరిలో ఒకరు మగ పిలగాడు ( 2.5 కేజీలు) కాగా ఒకరు ఆడ పాప (2.3 కేజీలు) జన్మించారు. లక్ష్మీ కి ఇది మూడవ కాన్పు కావడం విశేషం. తల్లీ పిల్లలు ఇద్దరు మంచి ఆరోగ్యంగా వున్నారు అని డాక్టర్ మౌనిక తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ ప్రారంభం నాటి నుండి కవల పిల్లలు పుట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ శస్త్ర చికిత్సలో మత్తు డాక్టర్ శివ రామకృష్ణ ప్రసాద్, నర్సింగ్ ఆఫీసర్ సుజాత, ఏఎన్ఎం స్వరూప రాణి, స్టాఫ్ పాల్గొన్నారు.