ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో సీజేఐ ధర్మాసనం తీర్పు
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును తోసిపుచ్చిన సుప్రీం
రాజకీయ ఫిరాయింపులు అడ్డుకోకపోతే ప్రజాస్వామ్య పునాదులకే ముప్పు
అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పున:పరిశీలించాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించిన నాటి నుంచి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో గతేడాది నవంబర్ 22న రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మొత్తం ‘పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు నిర్ణయించాలి. ఏ ఎమ్మెల్యే విచారణను కొనసాగించడానికి అనుమతించొద్దు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పార్టీ మారిన వారిపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్‌ఎస్, ఆ పార్టీ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి.జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజరు, బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజరు కుమార్, కాలె యాదయ్య, బండ్ల కష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు దాఖలైన తరువాత దాదాపు ఏడు నెలల్లో తొమ్మిది సార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ముందు నుంచి ఈ పిటిషన్లపై విచారణ చేపట్టగా, పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు, మోహిత్ రావు, స్పీకర్, ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, అభిషేక్ మను సింఘ్వి, రవి శంకర్ జంధ్యాల, గౌరవ్ అగర్వాల్, నిరంజన్ రెడ్డి పలువురు వాదనలు వినిపించారు. కాగా… సుదీర్ఘ వాదనల తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం 74 పేజీల తీర్పును వెలువరించింది.
‘ఆపరేషన్ సక్సెస్… పేషెంట్ డైడ్’ సూత్రం సరికాదు
ఈ కేసులో స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయడంలో వైఫల్యం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లక్ష్యాన్నే నీరుగార్చుతుందని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. రాజకీయ ఫిరాయింపులను అరికట్టకపోతే, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని పేర్కొన్నారు. ‘ఇప్పుడు మేం ఏ ఆదేశాలు జారీ చేయకపోతే… ‘ఆపరేషన్ సక్సెస్-పెషెంట్ డైడ్’ అన్నట్టుగా ఉంటుంది. ఇది స్పీకర్ ప్రస్తుత తీరును పునరావృతం చేయడానికి దోహదపడ్డట్టే’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. పదో షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యూనల్‌గా పని చేస్తున్నప్పటికీ, ఎటువంటి ‘కానిస్టిట్యూషనల్ ఇమ్యూనిటీ’ ని పొందలేరని స్పష్టం చేశారు. అలాగే అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను పొడగించడానికి అనుమతించవద్దని స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఇక స్పీకర్‌లు అనర్హత పిటిషన్లను ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంచే పరిస్థితిని రాజ్యాంగ ధర్మాసనం ఊహించి ఉండకపోవచ్చన్నారు. అంతేకాకుండా అనర్హత పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయించాలని కీషమ్ మేఘచంద్ర సింఫ్‌ు కేసులో ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. శివసేన, ఎన్‌సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పిటిషన్లను నిర్ణీత సమయంలోగా నిర్ణయించాలని మహారాష్ట్ర స్పీకర్‌కు జారీ చేసిన ఆదేశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుందని సీజేఐ తీర్పులో పొందుపరిచారు. ఇక కోర్టులే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్‌ఎస్ అభ్యర్థలను ప్రస్తావిస్తూ… కిహౌటో హౌల్లోహన్, సుభాష్ దేశారు కేసుల్లో పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుంటూ, న్యాయస్థానాలే అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నట్టు స్పష్టం చేశారు.
పార్లమెంట్ పున:పరిశీలించాలి
అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పున: పరిశీలించాలని సీజేఐ ధర్మాసనం సూచించింది. తీర్పు ఆరంభంలో రాజ్యాంగంలోని 52వ సవరణలో భాగంగా తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం(యాంటి డిఫెక్షన్ లా)లోని అంశాలు, అభ్యంతరాలను సీజేఐ ప్రస్తావించారు. ‘రాజకీయ ఫిరాయింపులు జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. దీనిని ఎదుర్కోకపోతే… మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది’ అని అన్నారు. న్యాయస్థానాల్లో ఆలస్యం, అసెంబ్లీ పదవి కాలం ముగిసేలోపు అనర్హత పిటిషన్లపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకే స్పీకర్‌కు నిర్ణయాధికారం ఇచ్చినట్టు అభిప్రాయపడ్డారు.
అయితే అనర్హత పిటిషన్లను నిర్ణయించడానికి స్పీకర్/చైర్మెన్‌కు అప్పగించే ప్రస్తుత యంత్రాంగం.. రాజకీయ ఫిరాయింపుల ముప్పును అరికట్టడానికి అనుకూలంగా ఉందో లేదో పున: పరిశీలించాలని ధర్మాసనం పార్లమెంట్‌ను కోరింది. ‘మాకు ఎలాంటి సలహా ఇచ్చే అధికారం లేదు. అయినా అనర్హతపై స్పీకర్/చైర్మెన్లకు కల్పించబడిన హక్కులు రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా ఎదుర్కోగలదా? లేదా అనేది పార్లమెంట్ ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య పునాదులను నిలబెట్టే సూత్రాలను కాపాడుకోవాలంటే… ఈ విధానం సరిపోతుందా? లేదా ? అనేది పున:పరిశీలించాలి. ఇలాంటి అనర్హత పిటిషన్లలో లోపాలు పునరావతం కాకూడదంటే… దానిపై నిర్ణయం తీసుకోవడం పార్లమెంట్ బాధ్యత అని మేం భావిస్తున్నాం’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు.
మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES