Tuesday, April 29, 2025
Homeజాతీయంరాజధానిపై చట్టం చేస్తాం

రాజధానిపై చట్టం చేస్తాం

- Advertisement -

– రెండోదశ పూలింగుపై రాజధాని రైతులకు సిఎం భరోసా
అమరావతి : రాజధాని అమరావతిపై చట్టం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని కోసం రెండోదశ పూలింగుకు వెళుతున్నా తొలిదశ ఇచ్చిన రైతులెవరూ భయపడాల్సిన పనిలేదని, అన్నీ తాను చూసుకుంటానని అన్నారు. రాజధాని ప్రాంత రైతులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో రైతుల అభిప్రా యాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. పూలింగుకు ఇచ్చిన భూములకు విలువ ఉండదేమోననే భయం ఉందని, భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా రాజధాని అమరావతి అని చట్టం చేయించాలనీ రైతులు కోరారు. అసైన్డ్‌ భూముల రిటర్నబుల్‌ ప్లాట్ల విషయంలో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటులో స్వల్ప మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేర్వేరు భూములపై ఉన్న సిట్‌ విచారణ పూర్తి చేయాలని కోరారు. పూలింగుకు గుర్తుగా ఏమైనా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని సభ ఏర్పాట్లు, రిటర్నబుల్‌ ప్లాట్ల అభివృద్ధి కాంట్రాక్టులు అంశంపైనా రైతులతో సిఎం మాట్లాడారు. రైతులు చెప్పింది విన్న సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేసే అంశంపై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉందని, అందువల్లే కొత్త రాజధాని అంశాన్ని చట్టం చేయించలేకపోయామని అన్నారు. గడువు తీరిన నేపథ్యంలో వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుం టామని రైతులకు తెలిపారు. రాజధాని అభివృద్ధి విషయంలో ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తాను భరోసా ఇస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ వస్తాయని, పరిశ్రమలు రాకపోతే ప్రజలు రారని అన్నారు. కొత్తగా పూలింగుకు వెళ్లబోయే ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోకి ప్రజలు వస్తారని, అభివృద్ధి ఉంటుందని తెలిపారు. అలా రాకపోతే ఇక్కడ పంచాయతీగానో, మున్సిపాలిటీగానో మిగిలిపోతుందని, అభివృద్ధి సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాజధాని అభివృద్ధికి మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే లేఅవుట్ల అభివృద్ధికి టెండర్లు ఇచ్చామని, కాంట్రాక్టర్లు పనులు మొదలుపెడుతున్నారని, రైతులు కూడా బాధ్యతగా వ్యవహరించి పనులు చేయించుకోవాలని సూచించారు. అభివృద్ధి జరిగితేనే అమ్మకాలు, కొనుగోళ్లు జరిగి భూమి విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరుగుతుందని, నమ్మకం ఉంచాలని కోరారు. ఉన్న రాజధాని అభివృద్ధి చెందాలన్నా ఎయిర్‌పోర్టు అవసరం ఉందని, ఇక్కడకు పారిశ్రామికవేత్తలు రావాలంటే వెనకడుగు వేస్తున్నారని వివరించారు. అందువల్లే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రైతులకు తెలిపారు. రాజధాని కోసం రైతులు ఉద్యమం చేశారని, వారందరినీ కాపాడుకుంటానని అన్నారు. కృష్ణానదిపై మూడు, నాలుగు వారధులు వస్తాయని, అవుటర్‌, ఇన్నర్‌ రింగురోడ్లు ద్వారా మరింత అభివృద్ధి జరుగు తుందని తెలిపారు. అదనపు పూలింగు వల్ల ధరలు పడిపోతాయని అపోహ పడొద్దని, రైతులకు, తనకు మధ్య ఎటువంటి దూరం ఉండదని గుర్తించాలని కోరారు. రైతుల త్యాగాలకు గుర్తుగా శాతవాహన కాలం నాటి చరిత్రతో కలిపి మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గ్రామ కంఠాల్లో ఉంటూ పట్టాలు లేనివారికి పట్టాలు ఇవ్వాలని కోరగా దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు