నవతెలంగాణ – జుక్కల్
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నియోజక వర్గ పరిధిలోని గ్రామాలలో సోమవారం ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని సావర్గావ్, ఖండేబల్లూరు, వజ్రఖండి, సోపూర్,గుండూర్, బస్వాపూర్, డోన్గావ్, పెద్ద ఎడిగి, కథల్వాడి, హంగర్గా, మాదాపూర్, పడంపల్లి, లాడేగావ్, కంఠాలి, జుక్కల్, బిచ్కుంద మండలంలోని మిషన్ కల్లాలి, గుండె కల్లూర్ , గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి అని, బాధ్యత కలిగిన వ్యక్తినే సర్పంచ్ గా ఎన్నుకోవాలని సూచించారు.
అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా నేను అండగా ఉంటూ సహకారం అందిస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, రూ.500 /- కే గ్యాస్ సిలిండర్, రుణమాఫీ, సన్న వడ్లపై క్వింటాలుకు రూ. 500/- బోనస్,ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు ఇలా అనేక సంక్షేమ పథకాలతో పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిందని సంతోషం వ్యక్తం చేశారు..
అవే కాకుండా కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్, సీఎంఆర్ఎస్, ఎల్వోసీలు అందించి ఎంతో మంది పేదలకు లబ్ది చేకూర్చుతున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సరిగ్గా అమలు చేయాలన్నా ప్రతీ పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నా సరైన వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకోవాలని చెప్పారు.



