ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని తిరస్కరించండి
ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండాను ఆదరించండి
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్ బాబు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో పేదల గొంతుకగా నీతి నిజాయితికి మారుపేరుగా ఉన్న సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్ బాబు కోరారు. సోమవారం బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృతలాల్ శుక్ల భవన్ లో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా స్థాయి విస్తృత సమావేశం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు జవ్వాజీ విమల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు మద్యం ఓటర్లను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ లు ప్రయత్నం చేస్తున్నాయని, నీతి నిజాయితీగా ప్రజా సమస్యలను ఏజెండాగా పెట్టుకొని ప్రజల కోసమే పని చేసే పార్టీగా సీపీఐ(ఎం) ఉందన్నారు.
ఆ బూర్జువా పార్టీలన్నీ ఒకే తాను ముక్కలని వాటి జెండాల రంగుల్లో మాత్రమే తేడా ఉందని చెప్పారు. వారి విధానాలన్నీ ప్రజలను దోచుకునేటివేనని అన్నారు. సీపీఐ(ఎం) ఎర్రజెండా పోరాటాల ఫలితంగానే బి.వై. నగర్ సుందరయ్య నగర్ లు ఏర్పడ్డాయని చెప్పారు. బీడీ కార్మికుల సమస్యల పైన నిరంతరం పోరాడుతున్న ఎర్రజెండాను ఆదరించాలని చెప్పారు. పవర్లూమ్ కార్మికులకు నేడు ఈ హక్కులు నిలబడ్డాయన్న ఎర్రజెండా ఉద్యమాల వల్లే సాధ్యమైందన్నారు. కూలి రేట్ల పెంపుదల , వర్కర్ టు ఓనర్ పథకం వంటివి కమ్యూనిస్టుల పోరాటాల ఫలితమేనని చెప్పారు. సిరిసిల్ల చేనేత వస్త్ర పరిశ్రమ పరిరక్షణకు సీపీఐ(ఎం) ఎనలేని కృషి చేసిందన్నారు. పేదల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కోసం జరిగిన కృషిలో అగ్రభాగాన నిలిచిందన్నారు. సిరిసిల్ల మున్సిపల్ లో ప్రశ్నించే గొంతుక పేదల బాధలు పాలకుల దృష్టికి తీసుకెళ్లగలిగే అవి పరిష్కారం కాకపోతే ప్రజా ఉద్యమాలతో పాలకులను మెడలు వంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు.
మున్సిపల్ ఎన్నికలలో మార్క్సిస్టు పార్టీ అభ్యర్థుల గెలుపు ద్వారా పేదల వానీ, బాణీ వినిపించబడుతుందన్నారు. నాటి కమ్యూనిస్టుల త్యాగాల పునాదుల మీద నిర్మితమైన బి.వై. నగర్ , సుందరయ్య నగర్ వాసులు సిపిఎం అభ్యర్థుల గెలుపుకు సహకరిస్తారని 21, 33, 34 వార్డులలో సీపీఐ(ఎం) అభ్యర్థులను ఓటర్లు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణ ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) దశల వారి పోరాటాలు నిర్మించిందని గుర్తు చేశారు. పవర్లూమ్ పరిశ్రమ రక్షణ కోసం బీడీ కార్మికుల సమస్యలు పట్టణ ప్రజల సమస్యలపై సీపీఐ(ఎం) రాజీలేని పోరాటాలు నిర్మించిందన్నారు. ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడుతున్న ఎర్ర జెండాకు పట్టం కట్టాలని కంటికి రెప్పలాగా ఇంటి ఆడబిడ్డ లాగా ఎర్రజెండాను కాపాడుకోవాలని చెప్పారు.
సమావేశ అనంతరం సీపీఐ(ఎం) అభ్యర్థులకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్ బాబు పార్టీ ఎన్నికల “బి” ఫారాలు అందజేశారు. అనంతరం 33,34 వార్డులలో ఇంటింటా ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు 21 వ వార్డు వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి కోడం రమణ , 34 వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి సీనియర్ నాయకులు రాపల్లి రమేష్ , 33 వ వార్డు అభ్యర్థి సీపీఐ(ఎం) యువ నాయకుడు ఎలిగేటి రాజశేఖర్ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ , గురిజాల శ్రీధర్ , శ్రీరాముల రమేష్ చంద్ర , సీపీఐ(ఎం) నాయకులు రామంచ అశోక్, సావనపల్లి రాములు, నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, దాసరి రూప, తన్నీరు లక్ష్మీరాజం, లక్ష్మీ, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు, తదితరులు పాల్గొన్నారు.



