సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలతో పాటు నల్లగొండ కార్పొరేషన్ కు జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కోరారు. మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజా పోరాటాల నిర్వహిస్తూ ప్రజల అండదండలతో బరిలో నిలిచిన సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని తెలుస్తోందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున పరలోభాలకు గురి చేయడానికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ప్రజా హక్కులను కాపాడుకోవడానికి ప్రశ్నించే తత్వాన్ని నిలబెట్టేందుకు ఓటు హక్కును నిఖార్సుగా వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య రక్షణకై ప్రజల హక్కులకై పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. లౌకిక ప్రజాస్వామ్నిక శక్తులను గెలిపించాలని ఆయన కోరారు. పురపాలక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఓడించి నామరూపల్లేకుండా చేయాలన్నారు.
కులం, మతం పేరుతో అనేక కుయుక్తులు పన్నుతూ మత ఘర్షలను రెచ్చగొడుతూ.. అవకాశవాదాన్ని ముందుకు తీసుకొచ్చి లబ్ధి పొందుతుందన్నారు. యువత మహిళలు ప్రజలు వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ సీపీఐ(ఎం) బలపరుస్తున్న అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలన్నారు. పది రోజులపాటు జరిగిన ప్రచార కార్యక్రమాల్లో సభలు సమావేశాల్లో ప్రజలు పాల్గొన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టి ఓట్లు కొనుగోలుదారులు వస్తున్నారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకొని నికార్సైన కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



