నవతెలంగాణ – జుక్కల్
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం జుక్కల్ మండలం పెద్ద గుల్ల గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మదారావు దేశాయ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పేరును ఉపయోగించి కొంత మంది వ్యక్తులు ఓట్లు అడుగుతున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ అధికారికంగా బలపర్చిన అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరారు. గుల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మదారావు దేశాయ్ పోటీ చేస్తున్నారని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



