జనవరి 25–28 వరకు హైదరాబాదులో నిర్వహణ
పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
నవతెలంగాణ – మిర్యాలగూడ
హైదరాబాద్‌లో జనవరి 25 నుంచి 28 వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి తెలిపారు. ఈ మహాసభలను మహిళలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
బుధవారం మిర్యాలగూడ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ నాలుగు రోజుల జాతీయ మహాసభలకు హాజరవుతున్నారని తెలిపారు.ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై విస్తృత చర్చ జరగనుందని, భవిష్యత్ మహిళా ఉద్యమాలకు దిశానిర్దేశం చేసే కార్యాచరణ రూపుదిద్దుకోనుందని అన్నారు.
ఐద్వా మహిళల సమాన హక్కులు, విద్య, బాల్యవివాహాల నిషేధం, ఆస్తి హక్కు, వరకట్న వేధింపుల నిరోధానికి ఐపీసీ 498ఎ సెక్షన్, కేంద్ర–రాష్ట్ర మహిళా కమిషన్లు, గృహహింస నిరోధక చట్టం, పనిచోట్ల లైంగిక వేధింపుల నిరోధక చట్టం, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు వంటి అనేక కీలక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేసి సాధించిందని ప్రభావతి గుర్తు చేశారు.జిల్లాలో చీప్ లిక్కర్ ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఐద్వా చేపట్టిన ఉద్యమాల వల్ల ఆ నిర్ణయాన్ని నిలువరించడంతో పాటు అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
భవిష్యత్తులో చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లును సాధించేందుకు సుదీర్ఘ పోరాటాలు కొనసాగిస్తూనే, అధికారంలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించే ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో, సంస్కృతిలో మహిళలపై జరుగుతున్న అణచివేతను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగే ఈ జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు వేలాదిగా మహిళలు, ప్రజలు హాజరై మహాసభలను జయప్రదం చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన్, వన్ టౌన్ కార్యదర్శి మనుల అరుణ, వన్ టౌన్ అధ్యక్షురాలు కొంపెల్లి కౌసల్య ఇతర నాయకులు పాల్గొన్నారు.



