జనవరి 25-28 వరకు 14వ జాతీయ మహాసభ
ఎన్టీఆర్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట
ఐద్వా 14వ జాతీయ మహాసభ సందర్భంగా జనవరి 25న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు మహిళా లోకం తరలిరావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐద్వా ఆల్ ఇండియా మహాసభ జరుగుతుందని తెలిపారు. జనవరి 25న ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభకు మహిళలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగే ఈ మహాసభలో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించి, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తామన్నారు.
మహిళల హక్కులు, విద్య, బాల్య వివాహాల నిషేధం, ఆస్తి హక్కు చట్టం, వరకట్న వేధింపుల నిరోధానికి ఐపీసీ 498 ఏ సెక్షన్, కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్, గృహాహింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు వంటి అనేక సమస్యలపై దేశవ్యాప్తంగా ఐద్వా అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏండ్ల కాలంలో మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై, యువతులపై వేధింపులు, హత్యలు, లైంగికదాడులు పెరిగాయని తెలిపారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్.ఆశాలత, రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల వినోద, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, జిల్లా కోశాధికారి మేకనబోయిన సైదమ్మ, రైతు సంఘం జిల్లా నాయకులు కొప్పుల రజిత తదితరులు ఉన్నారు.
మహాసభకు 1000 మంది ప్రతినిధుల రాక : ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి
జనవరి 25 నుంచి 28 వరకు జరిగే ఐద్వా జాతీయ మహాసభకు దేశవ్యాప్తంగా 1000 మంది మహిళా ఉద్యమ ప్రతినిధులు హాజరవుతారని రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి తెలిపారు. ఐద్వా జాతీయ నాయకులు బృందాకరత్, ఆల్ ఇండియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీమతి టీచర్, మరియం దావలె, జాతీయ నాయకులు ఎస్.పుణ్యవతి, సుధా సుందర రామన్ పాల్గొంటారని చెప్పారు. ఐద్వా జాతీయ మహాసభ విజయవంతం కోసం రాష్ట్రవ్యాప్తంగా సెమినార్‌లు, సదస్సులు, ఫొటో ఎగ్జిబిషన్, కళాజాతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభ విజయవంతానికి ప్రజలంతా హార్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.



