Saturday, March 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయుద్ధ వ్యతిరేక ర్యాలీని విజయవంతం చేయండి

యుద్ధ వ్యతిరేక ర్యాలీని విజయవంతం చేయండి

- Advertisement -

పీవైఎల్‌, డీవైఎఫ్‌ఐ, వైజేఎస్‌, ఏఐవైఎఫ్‌ సంపూర్ణ మద్దతు
వేలాదిగా తరలి రావాలని పిలుపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రపంచ శాంతికి తూట్లు పొడుస్తూ, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సాగిస్తున్న అక్రమ, అమానవీ య యుద్ధాన్ని నిరసిస్తూ నిర్వహించ తలపెట్టిన యుద్ధ వ్యతిరేక మహార్యాలీకి పీవైఎల్‌, డీవైఎఫ్‌ఐ, వైజేఎస్‌, ఏఐవైఎఫ్‌, యువజన సంఘాలు సంపూ ర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ నెల 29న (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు చార్మినార్‌ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వరకు జరిగే ఈ ర్యాలీలో వేలాదిగా తరలి రావాలని ఆ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యువజన సంఘాల సంయుక్త సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వి. రాకేష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, అనగంటి వెంకటేష్‌, వైజేఎస్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర వీరన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో, కేవలం చమురు, సహజ వనరుల ఆక్రమణ కోసమే ఇరాన్‌పై అక్రమంగా దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదనీ, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చే కుట్ర అని వారు విమర్శించారు. ఈ యుద్ధంతో గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న సుమారు 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికుల ప్రాణాలు, జీవనోపాధి ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ముదిరితే వారి భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

యుద్ధం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయని, దీనివల్ల దేశంలో పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యా వసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ముఖ్యంగా జోమాటో, స్విగ్గి, రాపిడోలపై ఆధార పడ్డ యువతకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా తన మౌనాన్ని వీడాలనీ, ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని తక్షణమే ఖండించాలని డిమాండ్‌ చేశారు. అమెరికాకు తొత్తుగా వ్యవహరించకుండా, భారతదేశం తన స్వతంత్ర విదేశీ విధానాన్ని చాటుకోవాలని, శాంతి స్థాపనలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

యువతకు పిలుపు
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ప్రపంచ శాంతిని కాంక్షించే విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున కదిలి రావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం చార్మినార్‌ వద్ద ప్రారంభమయ్యే ఈ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించి, యుద్ధోన్మాదుల కండ్లు తెరిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు బి.ఎస్‌.కృష్ణ, నాయకులు లింగంపల్లి రాజు, సి.ఎం. సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -