ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి జబ్బార్
నవతెలంగాణ – వనపర్తి : గద్వాల జిల్లా కేంద్రంలో ఈ నెల 13, 14 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవాజ్ సంఘం మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం డి జబ్బార్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ఉదయం వివిధ ప్రజా సంఘాలు కళాకారులు కావులతో కలిసి ఆవాజ్ రాష్ట్ర మూడవ మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. దేశంలో ప్రజల మధ్య కేంద్ర బిజెపి ప్రభుత్వం మతాలను సాకుగా చూపుతూ మత ఘర్షణలకు పూనుకుంటుందని ఘాటుగా విమర్శించారు. గత 40 ఏళ్లకు పైగా ఆవాజ్ ఏర్పడిన నాటి నుంచి మైనార్టీల సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం, నిరక్షరాస్యతను పారదోలెందుకు, నిరుద్యోగం వెనుకబాటుతనాన్ని తరిమికొట్టేందుకు అనేక సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు.
వీటితోపాటు లౌకిక, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల సాధన కోసం విశాల ప్రాతిపదికన ఆవాజ్ పని చేస్తుందని తెలిపారు. కుల, మత భేదాలు లేకుండా అన్ని వర్గాలను సమానంగా ప్రతి ఒక్కరూ చూడాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అణగారిన వర్గాల వెనుకబాటు తన్నాన్ని బిజెపి ఆసరాగా చేసుకొని బిజెపి పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలపై విచ్చలవిడిగా దాడులు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గో రక్షణ పేరుతో మూక దాడులు జరుగుతున్నాయని, వాటిని వెంటనే ఎక్కడికక్కడ ఆపేయాలని హెచ్చరించారు. ఆవాజ్ మహాసభలకు కవులు, కళాకారులు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల అనుబంధ సంఘాల నాయకులు అందరూ మహాసభలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, ఈ పరిణామం సంతోషించదగ్గ విషయమని తెలిపారు.
గద్వాల జిల్లా కేంద్రంలో మక్కా మసీదు నుంచి ఈనెల 13వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. 14వ తేదీన ప్రతినిధుల మహాసభ ఉంటుందని, ఈ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షులు మునీరుద్దీన్, ప్రముఖ కవి జనజ్వాల, అవాజ్ నాయకులు రియాజ్, హమీద్, చందు భాషా, సత్తార్, సామాజిక నాయకులు గంధం నాగరాజ్, విజ్ఞాన దర్శని రాష్ట్ర అధ్యక్షులు ఆదం రాజు, పాస్టర్స్ మార్టిన్, గంధం బాలరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల్ రెడ్డి, పరమేశ్వర చారి, నాయకులు బాలస్వామి పాల్గొన్నారు.