– ఉగ్రదాడుల సమయంలోనే కార్మిక కోడ్స్‌ను అమల్లోకి తెచ్చిన కేంద్రం: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– చర్లపల్లి పారిశ్రామికవాడలో సమ్మె సన్నాహక సదస్సు
నవతెలంగాణ – చర్లపల్లి
కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 9న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని సూరాన చౌరస్తా వద్ద మంగళవారం చర్లపల్లి ఇండిస్టియల్ ఎంప్లాయీస్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలుడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, కార్మిక వర్గాన్ని దోచుకునే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో జులై 9కి వాయిదా వేశామని తెలిపారు. కానీ కేంద్రం అదే సమయంలో అత్యంత దుర్మార్గంగా లేబర్ కోడ్స్‌ను అమలులోకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచడం, మహిళలకు రాత్రి పూట డ్యూటీలు వేయడం, ఈజీ ఆఫ్ డూయింగ్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగించాలన్నదే మోడీ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు.
మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నాలుగు కోడ్స్‌గా మార్చడం ద్వారా పర్మినెంట్ ఉద్యోగ భద్రతకు ముప్పు వస్తుందన్నారు. చర్లపల్లి ఇండిస్టియల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. సమ్మె విజయవంతం కావడం ప్రతి కార్మికుని బాధ్యత అని తెలిపారు. ఈ సమావేశానికి చర్లపల్లి ఇండిస్టి యల్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షులు బివి.సత్యనారాయణ అధ్యక్షత వహిం చారు. టీయూసీఐ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ప్రవీణ్, ఐఎఫ్‌టీయూ శ్రీనివాస్, ఎపిరాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.మణికంఠ, టికెఐఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, కె.బాలరాజ్, గండూరి ఫుడ్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, టి.రవీందర్‌రెడ్డి, ఎన్నార్ టెక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండీ పాషా, శివఫ్రా క్రేన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్, ఆశీష్ క్రేన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, హైక్యూబ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సంతోష్, 3డి ఫోమ్ కట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.ఆదాం, ఐడీఏ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జె.నరసమ్మ పాల్గొన్నారు.