రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ వెంకన్న
నవతెలంగాణ – కట్టంగూరు
కల్లుగీత కార్మిక సంఘం 4వ మండల మహాసభను ఈ నెల 27 తేదీన మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ వెంకన్న తెలిపారు. గురువారం మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. కల్లుగీత సొసైటీలు టీఎఫ్టీఎ గ్రామాలకు మద్యం షాపులలో రిజర్వేషన్ 25 శాతం అమలు చేయాలని, ప్రభుత్వం ఇటీవల గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన మద్యం పాలసీ వల్ల గీతా కార్మికులకు ప్రయోజనం ఉండదన్నారు. కల్లుగీత సొసైటీలకు టీఎస్సీ గ్రామాలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలన్నారు.
మద్యం షాపులలో రిజర్వేషన్ పెంచితే ప్రభుత్వానికి లాభం తప్ప నష్టం ఉండదని చెప్పారు. కల్లుగీత సొసైటీలకు ఇచ్చినట్లయితే ఆర్థికంగా గీత కార్మికులకు ఉపయోగం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ప్రమాదానికి గురైన గీతా కార్మికులకు ఇవ్వాల్సిన
పెండింగ్ ఎక్స్రేషియా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వృత్తిలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని, రక్షణ కవచాలను తక్షణమే అందించాలని,50 ఏండ్లు నిండిన వృత్తిదారుల అందరికీ పెన్షన్, కార్మికులకు ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం ఉచితంగా అందించాలని కోరారు. జీవో 560 ప్రకారం ప్రతి గ్రామంలో తాటి, ఈత చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు.జిల్లా కేంద్రంలో తాటి, ఈత ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మండల మహాసభకు మండలంలోని గీత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల అంజయ్య, నకిరేకల్ మండల అధ్యక్షులు గుడుగూoట్ల బుచ్చిరాములు, మండల కార్యదర్శి దండేంపల్లి శ్రీను, మండల అధ్యక్షులు మాద శ్రీను,జిల్లా ట్రైనర్ కాటమయ్య రక్షణ కమిటీ సభ్యులు పొడిచేటివీరయ్య,మండల సహాయ కార్యదర్శి గుండాల నగేష్,మండల కమిటీ సభ్యులు కొప్పుల రాములు,కారింగు సత్తయ్య ఉన్నారు.