Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం16న జిల్లా కేంద్రాల్లో ధర్నాను జయప్రదం చేయండి

16న జిల్లా కేంద్రాల్లో ధర్నాను జయప్రదం చేయండి

- Advertisement -

రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలకు ఎస్‌కేఎం పిలుపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనవరి 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపు నిచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు టీ.సాగర్‌, పశ్య పద్మ, బి.రాము, ఆర్‌.వెంకట్రాములు మామిడాల బిక్షపతి, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, సదానందం, భాస్కర్‌లు మాట్లాడారు. జనవరి 14న విద్యుత్‌ సవరణ బిల్లు, లేబర్‌ కోడ్లు, విత్తన చట్టం, వీబీజీ రామ్‌జీ బిల్లు ప్రతులను భోగిమంటల్లో దగ్ధం చేయాలని రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలతో పాటు రాష్ట్రాల హక్కులను హరించేలా చట్టాలను చేసిందని విమర్శించారు. ” మోడీ ప్రభుత్వం ఒక వైపున ప్రజాసంక్షేమంటూనే, మరో వైపున కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు దోచిపెడుతోంది. బీజేపీ పాలనలో కార్పొరేట్‌ సంస్థలకు రూ.18 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చింది.

ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నది. అత్యంత ప్రమాదకరమైన లేబర్‌ కోడ్లను అమలు చేసి కార్మికుల హక్కులను కాలరాస్తోంది. కార్మికులు ట్రేడ్‌ యూనియన్లు పెట్టుకోవడానికి ఆంక్షలు విదించింది’ అని వారు విమర్శించారు. వామపక్షాల పోరాటం ఫలితంగా 2008లో ఏర్పడ్డ ”మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం-2005” స్థానంలో ఏర్పాటు చేసిన వీబీజీ రామ్‌జీ స్కీంను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాల వాటాను పెంచి కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సవరణ చట్టం 2025 ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రైతులు, ప్రజలకు సబ్సీడీలను అందించండం రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమంగా ఉచిత విద్యుత్‌ రద్దు చేసే కుట్రలో బాగమేనని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోకి 100శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పు పట్టారు. ఈ కార్యక్రమంలో బి.ప్రసాద్‌, మూడ్‌ శోభన్‌, విజయ్, ఆర్‌.ఆంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -