నవతెలంగాణ – జక్రాన్ పల్లి
గ్రామ పంచాయతీ వర్కర్స్ వేతనాలు పెంచి, పర్మినెంట్ చేయాలని, సమస్యలను పరిష్కరించాలని 2025 సెప్టెంబర్ 7న హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపును ఇచ్చారు. జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో 22 ఆగస్టు తేదీన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు దాసు మాట్లాడుతూ.. స్వచ్ఛ తెలంగాణలో,స్వచ్ఛభారత్లో అగ్ర భాగాననిలిచి ప్రజారోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి పనిచేస్తున్న, వేతనాలు పెంచి పర్మినెంట్ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయుటకు పూనుకోవాలని ఆయన భారత ప్రధానమంత్రిని కోరారు. కనీస వేతనం 26వేలు, కనీస టెన్షన్ 10వేలు, పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలను వెంటనే అమలు చేయాలని దాసు డిమాండ్ చేశారు. గత సర్కార్ సఫాయి కార్మికులకు దేవుడని సెల్యూట్ పెట్టి, మల్టీ పర్పస్ విధానం పేరుతో మోసం చేసిందని ఆయన తెలిపారు. 2024 జనాభా ప్రతిపాదికన ఉద్యోగ సిబ్బంది కార్మికులను పెంచి పని భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు.
గ్రామపంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 7న ఐయప్టీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని దాసు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు గణేష్, చిట్టిబాబు, శ్రీనివాస్ రెడ్డి, రాజవ్వ, రాజన్న, నాగవ్వ చిన్నయ్య, ఎం సంతోష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.