Saturday, April 11, 2026
E-PAPER
Homeఖమ్మంతెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహ సభలను జయప్రదం చేయండి 

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహ సభలను జయప్రదం చేయండి 

- Advertisement -

– రాష్ట్ర నాయకులు పుల్లయ్య 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ఈ నెల 23 నుంచి 25 వరకు జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెం లో నిర్వహించే ఏఐకేస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం 3 వ రాష్త్ర మహాసభలను విజయవంతం చేయాలని ఈ సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పార్టీ రైతాంగానికి,సంఘ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మహా సభలు విజయాన్ని కాంక్షిస్తూ, సంఘం ఏర్పాటు అయి 90 ఏళ్ళు అయిన సందర్భంగా శనివారం మండలంలోని పండువారిగూడెం లో సంఘ పతాకాన్ని ఆవిష్కరించి, మహా సభలు ప్రచార కరపత్రాలను విడుదల చేసారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ .. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, వ్యవసాయ రంగాన్ని రక్షించటానికి కృషి చేస్తున్న అఖిల భారత కిసాన్ సభ కు అనుబంధం గా తెలంగాణ రైతు సంఘం పని చేస్తుందని అన్నారు.ఈ సంఘం రాష్ట్ర 3వ మహాసభలు ఏప్రిల్ 23, 24,25 తేదీలలో కొత్తగూడెం పట్టణంలో జరుగుతున్నందున ఈ మహాసభల జయప్రదానికి హార్ధిక, ఆర్థిక సహకారాన్ని అందించి విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసారు.

భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, జమీందారీ, జాగీర్దారులకు వ్యతిరేకంగా రైతాంగానికి అండగా నిలబడి రైతాంగ హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న అఖిలభారత కిసాన్ సభ, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా పోరాడుతున్నది అన్నారు.వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలని ఎండగట్టి వ్యవసాయాన్ని రక్షించటం కోసం, డిల్లీ కేంద్రంగా 13 నెలలపాటు మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని సమీకరించి పోరాడి విజయం సాధించినది అఖిల భారత కిసాన్ సభ. ప్రభుత్వం తాత్కాలింగా వెనుక్కు తగ్గినా రైతాంగానికి ప్రమాదం పొంచే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో రైతాంగం ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ప్రకారం మద్దతు ధర, పంటలకు భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూలమైన పసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అని, దేశంలో పండే పత్తికి గిట్టుబాటు ధర లేకుండా చేసి, విదేశీ పత్తిపై ఉన్న సుంకాలను ఎత్తివేసి భారత పత్తి మార్కెట్ను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసి రైతాంగాన్ని నష్టపర్చింది. మరోవైపు వ్యవసాయ కార్మికులు పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి వికసిత్ భారత్ జిరామ్జి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి 26 కోట్ల మంది గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బ తీసింది అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజన చేసి కార్మిక హక్కులను కాల రాసింది.

ఈ నేపధ్యంలో రైతాంగ సమస్యలతో పాటు గ్రామీణ పేదలు మరియు కార్మిక హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు నిర్మిస్తున్నది రైతు సంఘం. అలాగే కార్పొరేట్ అనుకూలమైన నూతన విత్తన బిల్లును తీసుకువచ్చి దేశంలో అమలులో ఉన్న విత్తన చట్టాన్ని రద్దు చేసింది, దీని వలన రైతాంగం తీవ్రంగా నష్ట పోతుంది. నూతన విద్యుత్ సవరణ చట్టం పేరుతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలకు ఉన్న సబ్సిడీలను ఎత్తివేసి సుమారు లక్ష కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం వేసే విధంగా ప్రభుత్వం అదుగులు వేస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 1962 అణుశక్తి చట్టాన్ని, 2010 అణునష్టానికి, పౌర బాధ్యత చట్టాన్ని రద్దుచేసి కార్పొరేట్ కంపెనీలకు అనుమతించే నూతన చట్టాన్ని తీసుకురావడం వల్ల ప్రజల ఆరోగ్యాలను, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది.

మన రాష్ట్రంలో రైతాంగ ప్రధాన సమస్యలైన గిట్టుబాటు ధర, బీమా సౌకర్యం, బోనస్, రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలపై నిరంతరం రైతు సంఘం పోరాడుతుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నిర్మించి తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కోసం పోరాడుతున్నది తెలంగాణ రైతు సంఘం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు అందించాలని గత రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నది. తెలంగాణ రైతు సంఘం. కావున భవిష్యత్ కార్మిక, కర్షక, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఈ మహాసభల జయప్రదానికి ప్రముఖులు. మేధావులు, రైతు శ్రేయోభిలాషులు హార్దిక, ఆర్థికంగా భాగస్వాములు కావాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిరంజీవి,మడకం గోవింద రావు, దుర్గా రావు,సీసం రాము, నాగేశ్వరరావు, బాబు రావు, సోమరాజు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -