Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిప్లవానికి కేంద్రం 'మఖ్దూం భవన్‌'

విప్లవానికి కేంద్రం ‘మఖ్దూం భవన్‌’

- Advertisement -

– నూతన భారతాన్ని నిర్మించడమే మా లక్ష్యం

  • బీహార్‌లో ప్రజల ఓట్లను తొలగిస్తున్న ఈసీ
    – దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్న ఫాసిస్టు శక్తులు
    – రాజ్యాంగాన్ని, దేశాన్ని లౌకిక, ప్రజాస్వామికవాదులు కాపాడాలి : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా
    – వర్గ పోరాటాలను ముందుకుతీసుకెళ్లాలి : సురవరం
    – కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ అనుబంధం విడదీయరానిది : మహేశ్‌కుమార్‌గౌడ్‌
    – సోషలిస్టు వ్యవస్థలోనే అసమానతలుండవు : జాన్‌వెస్లీ
    – ఘనంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయం పున:ప్రారంభం
    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

    సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌ విప్లవానికి కేంద్రం కావాలని ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి డి రాజా ఆకాంక్షించారు. సమస్యలతో బాధపడే ప్రజలు ఈ కార్యాలయానికి రావాలన్నారు. నూతన భారతాన్ని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. వర్గరహిత, కులరహిత సమాజాన్ని నిర్మిస్తామని వివరించారు. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఒక వర్గానికి చెందిన ప్రజల ఓట్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌ మాదిరిగానే తెలంగాణ, ఏపీ, పశ్చిమబెంగాల్‌, కేరళ తదితర రాష్ట్రాల్లో ఓటర్లను తొలగించే ప్రమాదముందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు, ప్రజాస్వామ్య పార్టీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువారం హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో పున:నిర్మాణం చేసిన సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాలయాన్ని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు.

  • అనంతరం నిర్వహించిన సభలో రాజా మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించి నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బద్ధమైన సంస్థ ఎన్నికల కమిషన్‌ చర్యలు ఓటర్లకు ప్రమాదకరంగా మారాయన్నారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామిక శక్తులపై ఉందని చెప్పారు. దేశం ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. కేంద్రంలో మతతత్వ శక్తులు అధికారంలో ఉన్నాయని చెప్పారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్‌, సోషలిస్టు పదాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైందన్నారు.

  • సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఆపరేషన్‌ కగార్‌ : మహేశ్‌కుమార్‌గౌడ్‌
    కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌కు మధ్య విడదీయరాని అనుబంధం ఉందని టీపీసీసీ అధ్యక్షులు బి మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ కలిసి నడుద్దామనీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. కమ్యూనిస్టు భావజాలానికి మరణం లేదనీ, సిద్ధాంతాలకు కొదవలేదని, నాయకత్వం వస్తూనే ఉంటుందని వివరించారు. ప్రజా భవనాలు, కమ్యూనిస్టు ఆస్తులు ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పారు. లౌకికవాదమంటే అర్బన్‌ నక్సలైట్లుగా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడితే దేశద్రోహులుగా ముద్రవేస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదంపై కాల్పుల విరమణ ప్రకటించిన మోడీ ప్రభుత్వం మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ఆపరేషన్‌ కగార్‌ను నిర్వహించిందన్నారు. అడవుల్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడం కోసమే ఆపరేషన్‌ కగార్‌ను చేపట్టిందని చెప్పారు. హిందువులు వేరు, హిందూత్వ వేరని అన్నారు. తాను కూడా హిందువునేననీ, పూజలు చేస్తానని చెప్పారు. కానీ వేరే మతంపై విషం చిమ్మడం సరైంది కాదన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా వాటిని అధిగమించి ముందుకుసాగుతున్నామని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు. ఇందుకు కమ్యూనిస్టుల సహకారం కావాలని కోరారు. కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, జాతీయ, లౌకికవాదం, ప్రజాస్వామ్యం విషయంలో జాతీయ స్థాయిలో అందరూ కలిసి ముందుకు సాగాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థను కాపాడాలని కోరారు. నక్సలైట్లను చంపొచ్చు కానీ నక్సలిజాన్ని చంపలేరని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు వేదికగా మఖ్దూంభవన్‌ ఉందన్నారు. మావోయిస్టులతో రాష్ట్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరిపి దేశానికే ఆదర్శంగా నివాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. హైదరాబాద్‌లో రాజ్‌బహదూర్‌ గౌర్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

  • మతోన్మాద శక్తులను గద్దెదించాలి : జాన్‌వెస్లీ
    దేశంలో మతోన్మాద శక్తులను గద్దెదించడం కోసం లౌకిక, వామపక్ష, ప్రజాస్వామిక, అభ్యుదయ వాదులందరూ కలిసి కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. పేద, ధనిక, కుల, మత, స్త్రీ, పురుష అసమానతల్లేని, సమాజ నిర్మాణానికి, సోషలిస్టు బావాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో దోపిడీ వర్గాలకు కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు బావాలు కలిగిన వారే ప్రత్యామ్నాయం అవుతారని అన్నారు. ఆ దిశగా ప్రత్యామ్నాయ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. మతోన్మాద, హిందూత్వ ఎజెండా పేరుతో కార్పొరేట్‌ శక్తులకు అనుకూలమైన బీజేపీ దోపిడీ వ్యవస్థకు, ఆ బావజలానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను కలుపుకుని పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్‌, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు అజీజ్‌పాషా, బాలచంద్రకాంగో, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మీడియా అకాడమి చైర్మెన్‌ కె శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ ఏపీ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, సినీగేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హేమంతరావు, శంకర్‌, విఎస్‌ బోస్‌, ఈటి నర్సింహ్మ, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బాలనర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

  • దోపిడీ ఉన్నంత కాలం కమ్యూనిస్టులుంటారు : సురవరం
    ప్రపంచంలో దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులుంటారని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సువరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాపంగా నేడు తీవ్ర సంక్షోభంతోపాటు యుద్ద వాతావరణం నెలకొందన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ఎన్నికైన తర్వాత యుద్ధ ప్రమాదాలు మరింత తీవ్రతరమయ్యాయని అన్నారు. ఫలితంగా నిరుద్యోగం పెరిగి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని వివరించారు. మోడీ పాలనలో కార్మికులు, యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. పెటుబడిదారీ విధానం సంక్షోభంలో ఉందన్నారు. పలు దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తున్నారని వివరించారు. భారత్‌ పక్కన ఉన్న నేపాల్‌, శ్రీలంకలో కమ్యూనిస్టులు అధికారం చేపట్టడం హర్షణీయమన్నారు. మోడీ పాలనలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని విమర్శించారు. వర్గ పోరాటాలను మందుకుతీసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -