Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'మాకినేని' గొప్ప మార్క్సిస్టు సైద్ధాంతికవేత్త

‘మాకినేని’ గొప్ప మార్క్సిస్టు సైద్ధాంతికవేత్త

- Advertisement -

ప్రజా ఉద్యమాల నిర్మాణమే ఆయనకు నిజమైన నివాళి
మతోన్మాదం, సరళీకృత విధానాలపై పోరాడాలి : ఎంబీ వర్థంతి సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎండీ అబ్బాస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు మాకినేని బసవపున్నయ్య (ఎంబీ) గొప్ప మార్క్సిస్టు సైద్ధాంతిక వేత్త అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎండీ అబ్బాస్‌ అన్నారు. ఆయన సమాజ గమనాన్ని, ప్రపంచ చరిత్రను మార్క్సిస్టు ధృక్పథంతో అధ్యయనం చేశారని తెలిపారు. ఎంబీ 34వ వర్ధంతి ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. మాకినేని బసవపున్నయ్య చిత్రపటానికి అబ్బాస్‌, పార్టీ సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్బాస్‌, మల్లారెడ్డి మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులుగా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలంటూ ఎంబీ సూచించారని గుర్తు చేశారు. ప్రజలతో మమేకం కావాలనీ, ఎలాంటి త్యాగాలకైనా, పోరాటాలకైనా సిద్ధం కావాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

గతంలో ఏం చేశామనేది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం, భవిష్యత్‌లో ఏం చేస్తామనేది కీలకమన్నారు. పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది ప్రజాపోరాటాలేనని చెప్పారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వచ్చిన ఒడిదుడుకులను లోతుగా అధ్యయనం చేసి ఆయన సిద్ధాంతీకరించిన గ్రంథాన్ని ఈతరం చదవాల్సిన అవసరముందన్నారు. అతి, మితవాద విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాన్ని నిర్వహించారని చెప్పారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక కమ్యూనిస్టు ఉద్యమం వెనుకబాటు పట్టిందని వారన్నారు. లాటిన్‌ అమెరికాలో ఇప్పటికీ ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయని గుర్తుచేశారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇరాన్‌ ప్రతిఘటిస్తున్నదని చెప్పారు. ఇందులో ఈ విషయంలో మోడీ స్పందన దుర్మార్గంగా ఉందని విమర్శించారు. సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను మతోన్మాదం అడ్డుకుంటున్నదని చెప్పారు. శ్రామికులను మతం పేరుతో విభజిస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జె.బాబురావు, శోభన్‌నాయక్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -