Friday, January 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం

నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం

- Advertisement -

లేదంటే భారత్‌పై మరిన్ని సుంకాలు
రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్‌ బెదిరింపు వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ : రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలన్న తన డిమాండ్‌ను పట్టించుకోకపోతే భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. భారత్‌, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాని నేపథ్యంలో ట్రంప్‌ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. ‘ప్రధాని మోడీ మంచి వారు. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం’ అని ట్రంప్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో విలేకరులతో అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించుకునే విషయంలో భారత ప్రభుత్వం నుంచి మద్దతు ఆశిస్తున్నామని తెలిపారు. ‘వారు వ్యాపారం చేసుకోవచ్చు.

కానీ మేము కూడా వారిపై త్వరగా టారిఫ్‌లు పెంచుతాం’ అని బెదిరింపు ధోరణిలో చెప్పారు. కాగా ట్రంప్‌తో ప్రయాణిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ లిండ్సే గ్రహం కూడా అధ్యక్షుడి మాటలను సమర్థించారు. రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు, భారత్‌పై అధిక సుంకాలు భారతీయ చమురు దిగుమతులను తగ్గిస్తాయని చెప్పారు. భారత్‌ సహా రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై ఐదు వందల శాతం వరకూ సుంకాలు విధించేందుకు బిల్లు తీసుకురావాలని సూచించారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలును గణనీయంగా తగ్గించిందని, ఏదో ఒక దశలో భారత్‌పై విధించిన సుంకాలను తగ్గిస్తానని ట్రంప్‌ గత నవంబర్‌ 10న తెలిపారు.

భారత్‌పై విధించిన సుంకాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని ఆయన అంగీకరించారు కూడా. ఇదిలావుండగా భారత్‌, అమెరికా మధ్య నెలల తరబడి వాణిజ్య చర్చలు జరుగుతున్నప్పటికీ ఒప్పందం కుదరడం లేదు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై విధించిన సుంకాలను ట్రంప్‌ రెట్టింపు చేశారు. దీంతో అవి యాభై శాతానికి చేరాయి. వాణిజ్య చర్చలు త్వరలోనే ఫలప్రదమవుతాయని, ఒప్పందానికి చేరువగా ఉన్నామని వాణిజ్య కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ గత నెలలో చెప్పినప్పటికీ పురోగతి మాత్రం కన్పించడం లేదు. ట్రంప్‌ హెచ్చరికపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ మార్కెట్లు మాత్రం స్పందించాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్టాక్‌ ఇండెక్స్‌ (నిఫ్టీఐటీ) రెండున్నర శాతం పడిపోయింది. వాణిజ్య సంబంధాల విషయంలో నెలకొన్న విభేదాలు రెండు దేశాల మధ్య ఒప్పందాన్ని మరింత జాప్యం చేస్తాయని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -