ఇది నిజమైన జీవితకాలపు గౌరవం, గొప్ప విశేషాధికారం అంటూ వ్యాఖ్య
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ గురువారం ఉదయం న్యూయార్క్ నగర మేయర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. డెమొక్రాట్ అయిన 34 సంవత్సరాల మామ్దానీ నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగుతారు. వామపక్ష భావజాలం కలిగిన మామ్దానీ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మాన్‌హట్టన్ సిటీ హాలు కింద ఉన్న చారిత్రక సిటీ హాల్ సబ్‌వే స్టేషన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ‘ఇది నిజమైన జీవితకాలపు గౌరవం, గొప్ప విశేషాధికారం’ అని వ్యాఖ్యానించారు. మమ్దానీ చేత న్యూయార్క్ అటార్నీ జనరల్ లెతితియా జేమ్స్ ప్రమాణం చేయించారు.
మామ్దానీకి ఆయన అత్యంత రాజకీయ సన్నిహితుడు. కాగా మధ్యాహ్నం సిటీ హాలులో జరిగిన కార్యక్రమంలో మామ్దానీ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. దీనికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మామ్దానీకి రాజకీయ స్ఫూర్తి ప్రదాతలలో ఒకరైన అమెరికా సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. న్యూయార్క్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో మామ్దానీని ఓడించేందుకు ట్రంప్ ఎంతగానో ప్రయత్నించారు. మామ్దానీ గెలిస్తే న్యూయార్క్ నగరానికి ప్రభుత్వ నిధులు ఆపేస్తానని బెదిరించారు. నేషనల్ గార్డ్స్ దళాలను మోహరించాలని కూడా చూశారు. అయితే మామ్దానీ ఎన్నిక తర్వాత ట్రంప్ తన మద్దతుదారులను, విమర్శకులను ఆశ్చర్యపరుస్తూ ఆయనను శ్వేతసౌధానికి ఆహ్వానించారు. ఈ భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగిందని చెప్పారు. ‘ఆయన గొప్ప పనులు చేయాలని కోరుకుంటున్నాను. అందుకు సహకరిస్తాను’ అని అన్నారు.
ఎవరీ మామ్దానీ?
1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించిన మామ్దానీ తల్లిదండ్రులు భారతీయ సంతతికి చెందిన వారు. చిన్నతనంలో కేప్‌టౌన్‌లో గడిపిన మామ్దానీ ఏడు సంవత్సరాల వయసులో న్యూయార్క్ చేరుకున్నారు. సెయింట్ జార్జ్‌కి చెందిన గ్రామర్ స్కూల్ (కేప్‌టౌన్), బ్యాంక్ స్ట్రీట్ స్కూల్ ఫర్ చిల్డ్రన్, బ్రాంక్స్ హైస్కూల్ ఆఫ్ సైన్స్‌లో విద్యాభ్యాసం చేసిన మామ్దానీ 2014లో బౌడాయిన్ కాలేజీ నుంచి ఆఫ్రికానా స్టడీస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. కళాశాలలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.ఆ తర్వాత న్యూయార్క్‌లో అనేక ప్రగతిశీల రాజకీయ ప్రచారాలపై పనిచేశారు. 2019లో ఆస్టోరియా, లాంగ్ ఐలాండ్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ 36వ డిస్ట్రిక్ట్ నుంచి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడ ఆయన అనేక ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. కాగా ఇప్పటి వరకూ ఒకే పడకగది ఉన్న అపార్ట్‌మెంటులో నివసిస్తున్న మామ్దానీ దంపతులు మాన్‌హట్టన్‌లోని అధికారిక మేయర్ నివాసానికి చేరుకుంటారు.



