నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు తాళలేక ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన తంగళ్ళపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని ఇందిరానగర్ కు చెందిన ముగ్ధం సురేష్ (29) రోజు కూలిగా పనిచేస్తూ భార్య స్వరూప, ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇంట్లో గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక మద్యానికి అలవాటు పడి పనిచేయకుండా తిరుగుతుండేవాడని తెలిపారు.
కుటుంబ సంసార జీవితంలో భార్యతో నిత్యం గొడవపడేవాడని, ఎంత చెప్పినా వినకుండా పనిచేయకుండా తన ప్రవర్తన మార్చుకోకుండా మద్యానికి బానిసై తిరుగుతుండేవాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కూడా ఇంట్లో గొడవలు జరగగా పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు గమనించి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా వరంగల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గత రెండు నెలల క్రితం కూడా తన అన్న అశోక్ ఇదే మాదిరిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.