Saturday, November 15, 2025
E-PAPER
Homeచౌరస్తానరుడా! ఓ నరుడా!!

నరుడా! ఓ నరుడా!!

- Advertisement -

లోపలినుంచి మ్యూజిక్‌ వినపడుతుంటే కునుకుపట్టింది దానికి. వీడు వచ్చేదాకా మనకు రెస్టే అనుకుంటూ నిద్రపోయింది. టైం ఎంతయిందో తెలీదు. చీకటి కాటుక కలర్‌ని మించి పోయింది. ధడాల్‌ మన్న చప్పుడుకి లేచింది అది. వీడు వచ్చేసినట్టున్నాడు డోర్‌ తీస్తున్న చప్పుడును బట్టి, దాన్ని పట్టుకుని వాడు మీద ఒంటి కాలు మీద నడిచే వాడిలా ఊగిసలాడుతున్న వరుసను బట్టి, ఐదారు రౌండ్లు వేసి వచ్చినట్టున్నాడీ సచ్చినోడు అనుకుంది అంది. డ్రైవింగ్‌ సీటు కుయ్యిమంది. వీలు మొర్రోమంది. కష్టం మీద ‘కీ’ ఎక్కడ గుచ్చాలో వెతికిపట్టుకుని, అటో ఇటో ఎటో గిర్రున తిప్పాడు. ఒక రెండు సార్లు బుర్రుమంది అది. ఎల్దామా? అన్న మాట వాడి నోటి నుంచి బయటకు రాడానికి తంటాలు పడింది. గేరు మార్చి ఏక్సిలేటర్‌ పీక గట్టిగా నొక్కాడు. ఆ నొక్కుడుకి అమాంతం ఎగిరి కింద పడాల్సింది అది కాని, బుర్రుమనడం ఆగిపోయింది.

అనగా మానేసింది అది. వాడు కీని తిప్పినప్పుడల్లా బుర్రుమండం, తొక్కినప్పుడల్లా తుస్సుమనడం విసుగెత్తిపోయాడు వాడు. వీడి దుంపతెగ. ఎంత కంపుకొడ్తున్నాడు. ఏమేం తాగాడో కానీ కడుపులో తిప్పుతోంది. వీడ్ని నమ్మి స్టార్టయితే తీసుకుపోయి ఏ బ్రిడ్జీ మీది నుంచో కిందకి దొర్లించేస్తాడు. వెనకనుంచి లారీని గుద్దాడా ముఖం పచ్చడైపోతుంది. వీడు మెలికలు తిరిగేట్టు, నడిపితే ఏ లారీ వాడో, వీడినడక అర్ధం కాక ‘డాష్‌’ ఇస్తే వీపుసాపు అవుతుంది. అందువల్ల ఇక్కడ్నించి కదిలేది లేదు అనుకుంది అది. ఆత్మరక్షణ కోసం తప్పదు అనుకుంది అది. ఏం సార్‌! బండికదలడం లేదా! మీరు పక్కకు తప్పుకోండి నేను చూస్తానంటూ వచ్చేడొకడెవడో. పక్కసీటు కీచుమంది. డ్రైవర్‌ సీట్లో కూచున్నవాడి దగ్గర ఏ వాసనాలేదు. అందుకే అది స్టార్టయ్యింది. ఫస్టు గేర్‌లో కొంత దూరం ఉరికింది కూడా. సార్‌ స్టార్టయింది ఇంక వెళ్లిపోవచ్చు అంటూ, ఆ ఆపద్బాంధవుడు దిగిపోతూ జాగ్రత్త సార్‌ డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడకుండా గల్లీలలోంచి వెళ్లిపోండి అన్నాడు. వాడు మళ్లీ డ్రైవింగ్‌ సీటులోకి వచ్చి చక్రం తిప్పబోయాడు. అది బుర్రుమనడం మానేసింది. ఇంచి కూడా కదల్లేదు.

ఏమైంది దీనికివ్వాళ అంటూ బుర్ర గోక్కున్నాడు వాడు. బుర్రగోక్కున్నా, జుట్టుపీక్కున్నా స్టార్టయ్యేది లేదు. నా జాగ్రత్తలో నేనున్నా అన్న మాటలు వినపడ్డాయి. వాడు బిత్తర పోయాడు. వెనక సీట్లో ఎవరూలేరు బయట మనుషుల్లేరు. మరీ మాటలు ఆడిందెవరు? ఎవరు? ఎవరది? అన్నాడు గొంతు పెంచి. నేనే! నీకు కనపడని ఆ నేను, నీ కారుని. అన్న మాట వినిపించి ఎగిరి కారు టాప్‌ కొట్టుకుని మళ్లీ సీట్లో కూలబడ్డాడు వాడు. కారు మాట్లాడటమేమిటని ముక్కుమీద వేలు వేసుకుందామనుకున్నాడు కానీ, ఎటు నుంచి ఎటు కదుల్తున్నదో తెలీని చేతికి ముక్కు అందనే లేదు. యస్‌! కారునే మాట్లాడుతున్నా. నీ ప్రాణాలు, ఎదుటివాడి ప్రాణాలు కాపాడ్డానికి, నా ముఖమూ వీపు పచ్చడయి, షేపవుటయ్యి, గ్యారేజీలో కోమాలో పడి వుండకుండా వుండటానికి ఈ నిర్ణయం తీసుకున్నా. నువ్వు ఇక నుంచి మందు తాగి నడిపితే ఇంతే ఇంక, స్టార్టవను ముందుకు కదల్ను నీదిక్కున్న చోట చెప్పుకోపో అంది కారు రాష్‌గా, రాష్‌గా నడిపేవాడి గూబ గుయ్యిమనిపించింది. కారు వోనర్‌ మారుమాట్లాల్లేదు కానీ కంపు వాసనకు గురకతోడైంది.

వీడ్ని అమాంతం విసిరి బయటపడేస్తే బాగుండేది అనుకుంది కారు అనబడే చతుశ్చక్ర శకటం. వీడింక ఇక్కడే నిద్దరోతాడు. వీడి డోసును మోసే శక్తి లేక లివర్‌కి, చిర్రెత్తితే భళుక్కు భళుక్కుమని కడుపులో మందును బయటకు తోసేస్తుంది అప్పుడు కారంతా గబ్బు గబ్బు గత్తర గత్తర ‘ఓ గాడ్‌ సేవ్‌మీ’ అనుకుంటున్న కారు పక్కన నేలమీద డబ్బున్న కారు పక్కన నేలమీద దబ్బుమన్న చప్పుడు వినిపించింది. ఎవరా అని చూసింది. తన పక్కనే ఓ మోటర్‌బైక్‌ నేలను కర్చుకుని వుంది. ఏంటి గురూ వున్నావా? పోయావా? అనడిగింది కారు, బైక్‌ని. నన్ను ఎక్కిన వాడ్ని నమ్ముకునడిస్తే పోయే దాన్నే. ఏ డివైడర్‌కో గుద్దుకుని ‘హరీ’ మనే దాన్నే. ఒంట్లో పార్ట్స్‌ అన్నీ ముక్కలైపోయి గోడుగోడున ఏడ్చేదాన్నే అంది బైక్‌. అవును సుమా ఈ మధ్య ఓ తాగుబోతు బైక్‌ కారణంగా ముప్పయి ప్రాణాలు కాలిబూడిదైపోయేయి అంది కారు. కదా! అందుకే ఇక నుంచి తాగినోడు ఎక్కినడిపితే స్టార్ట్‌ అవను. కదలనే కదలను అని డిసైడైపోయేను అంది బైక్‌. ఇంతకూ నిన్ను నడిపేవాడేడి అనడిగింది కారు. కిక్కు కొట్టీ కొట్టీ స్టార్టవక పోతే ననన్నిలా నేలమీద పడేసి అదిగో ఆ మట్టిలో పందిలా దొర్లుతున్నాడు చూడు అంది బైక్‌. వాడేనా దున్నపోతులా వున్నాడు.

స్టాండ్‌వేసి నిన్ను నిలబెట్టలేక పోయాడన్న మాట అంటూ కిసుక్కున నవ్వింది కారు. ఇటువైపు ట్రాఫిక్‌ ఎక్కువగా వుండదు కనుక నా బాడీ సేఫ్‌గానే వుంటుంది. వీడి మత్తు పూర్తిగా దిగితేగానీ స్టార్టవను అంది బైక్‌. కారుపక్కన బైకు దానిపక్క ఓ లారీ, లారీని అనుకుని ఓ ట్రక్కు, దాని పక్కన ఓ ఆటో ఆగిపోయాయి. ఈ వెహికల్సు అన్నీ ఎందుకు స్టార్టవడంలేదో మత్తు కళ్ల మావయ్యలకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎఐ అని కొత్తగొచ్చిందంటగద. అదే గోల్‌మాల్‌ చేస్తున్నట్టుంది అన్నాడు లారీ డ్రైవర్‌. అర్థమైంది ముందు తాగినోళ్ల బండ్లు స్టార్టయిత లేవన్నో అన్నాడు ట్రక్కు డ్రైవరు. కోటర్‌ కూడా తాగొద్దా మల్ల అన్నాడు ఆటో వాలా. ‘అల్కహాల్‌ ఈజ్‌ ఇంజూరియస్‌ టు హెల్త్‌’ అని మొత్తుకున్నా ఎంతమందిని గొట్టాల్లో ఊదించినా లాభంలేదు. ఆక్సిడెంట్లు పెరుగుతనే వున్నాయి. అందుకే మందు తాగి నడిపితే స్టార్ట్‌ అవము, నడవనే నడవము అన్నాయి కారు, బైకు, లారీ, ట్రక్కు, ఆటో!

  • చింతపట్ల సుదర్శన్‌
    9299809212
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -