ప్రియమైన వేణు గీతికకు,
నాన్నా ఎలా ఉన్నావు, మేము షిర్డీ నుండి మొన్ననే వచ్చాం. ఇక్కడ చలి పెరిగింది. అక్కడ ఇప్పుడే మొదలయిందని చెప్పావు. నీకు ఈ పాటికే అక్కడి వాతావరణం అలవాటయింది కాబట్టి జాగ్రత్తగా ఉండు.
సరే నాన్నా.. ఈ రోజు ఉత్తరంలో పిల్లలను విహార యాత్రలకు పంపేటప్పుడు చెప్పాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. పాఠశాలలు, కాలేజీల నుండి పిల్లలను టూర్‌కి తీసుకుని వెళ్తుంటారు. అలా తీసుకుని వెళ్లడం మంచిదే. ఎందుకంటే పిల్లల్లో మానసిక ఉల్లాసం, తోటి వారితో స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. ప్రకృతిలో గడపటం వల్ల వారికి పర్యావరణంపై అవగాహన పెరగడమే కాకుండా దాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. అలాగే చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకోవడం, మంచి పనులు చేయాలనే సంకల్పం కలుగుతుంది. అయితే కొందరు తల్లిదండ్రులు పిల్లలను పంపడానికి భయపడుతుంటారు. అలాంటి వారు పాఠశాలకు వెళ్లి వారి ప్రణాళిక ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి.
వారి భయాలను తెలియచేయాలి.
టూర్లకు వెళ్లే పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలేమిటంటే ఉపాధ్యాయులు చెప్పినట్లు వినాలి, వారికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లకూడదు, ఒంటరిగా అస్సలు వెళ్లకూడదని చెప్పాలి. అలాగే సమయానికి ఆహారం, ఒకవేళ మందులు వేసుకోవాల్సిన వారుంటే మందులు వేసుకోవాలని చెప్తూ, ఇవే విషయాలు ఉపాధ్యాయులకూ చెప్పాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలకు ముఖ్యంగా కాలేజీకి పిల్లలకు ఫొటోలు తీసుకోవడమంటే సరదా. ఫొటోలు తీసుకోవడం తప్పుకాదు, అవొక జ్ఞాపకాలు. అయితే కొండల మీద, గట్ల మీద, ప్రవహిస్తున్న నీటి మధ్యలో, సముద్రపు కెరటాలు వస్తున్నప్పుడు వాటి మధ్య ఫొటోలు తీసుకోవాలని సంబరపడుతుంటారు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొందరు నీటిని చూడగానే ఈత రాకపోయినా నీళ్ళల్లోకి వెళతారు. కొన్నేండ్ల కిందట బియాస్ నదిలో పిల్లలు ఫొటోలు తీసుకుంటూ నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.
అందుకే ఫొటోలు తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలకు గట్టిగా చెప్పాలి. అంతే కాకుండా ఉదయం బైల్దేరేముందు, రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రులకు తప్పని సరిగా ఫోన్ చేయాలి. ఉపాధ్యాయులకు కూడా ఈ విషయం చెప్పాలి. అప్పుడు తల్లిదండ్రులకు కొంచెం ఊరట కలుగుతుంది. ఈ ఫొటోల సరదాలో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన వారు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తలు ఎంతో అవసరం. నువ్వు ఎక్కడికి వెళ్లినా ఫొటోలు తీసుకుంటావు. అయితే తగిన జాగ్రత్తలో ఉంటావు. ఎందుకైనా మంచిదని నీకు మళ్లీ చెప్తున్నా.. ఫొటోలు తీసుకో కానీ, సాహసాలు చేయకు. ప్రమాదపు అంచులకు వెళ్లకు. స్నేహితులు ఏమీ కాదు వెళదాం అంటుంటారు. అయినా సరే అక్కడ ప్రమాదం పొంచి ఉందనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకు. ఉంటాను నాన్నా.
ప్రేమతో అమ్మ పాలపర్తి సంధ్యారాణి






కామెంట్‌లు (0)