అందరూ భయాలు, కష్టాలను చూసి వెనక్కి అడుగు వేస్తే ఆమె మాత్రం అక్కడ ఆశాదీపాలను చూశారు. అత్యంత చిన్న వయసులోనే తన సమాజం అనుభవిస్తున్న బాధలను అర్థం చేసుకున్నారు. చాలా మంది కాలు పెట్టడానికే భయపడే ప్రాంతంలో అడుగుపెట్టారు. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని తపించారు. ఈ ప్రయత్నంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. తనను తిరస్కరించిన సమాజంలోనే కొత్త వెలుగులు ప్రసరింపజేశారు. ఇప్పుడు అక్కడి పిల్లల చిరునవ్వులు, విద్యవైపు వారు వేసే అడుగులే ఆమెకు అత్యంత ఆనందాన్ని ఇస్తాయి. దీనంగా చూస్తున్న కండ్లు ఆమెను వెనక్కి వెళ్లనివ్వలేదు. సాయం అందించి ఆదుకుందామంటే.. అక్కడకు వెళ్లేదారే ఘోరం. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా నిస్వార్థంగా సేవ చేసిన మహోన్నత మహిళ ఆమె. ఆమె సేవలు చూసి దేశమే అబ్బురపడింది. ఆ మహిలే బుద్రి తాటి. ‘చీకటిని చీల్చుకొని వెళితేనే వెలుగు ఉద్భవిస్తుంది’ అంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో...
బుద్రి తాటి సెప్టెంబర్ 15, 1966న చండీగఢ్, బస్తర్‌లోని దంతెవాడ జిల్లా, హిరనార్ గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించింది. నిజానికి విద్య, వైద్యం ఇతర ప్రాథమిక సేవలు లేని మారుమూల గ్రామంలో ఆమె బాల్యం గడిచింది. సుమారు ఆరేండ్ల వయసులో గిరిజన సంక్షేమ ఆశ్రమంలో చేరి, పదోతరగతి వరకు చదువుకున్నారు. అక్కడి జీవితానుభవాలే ఆమె జీవిత గమనాన్ని మార్చేశాయి. అంతేగాదు ఆ నేపథ్యం ఆమెను సేవ వైపు మళ్లేలా చేసింది. అక్కడి ప్రజలు అనుభవిస్తున్న వేదనలు, మహిళల పట్ల చూపుతున్న వివక్ష ఆమెను ఆలోచింపజేసింది. మహిళలు నోరు తెరిచి మాట్లాడకూడదు. తన చుట్టూ ఉన్న సమాజంలో స్ర్తీలకు గౌరవడం లేకపోవడాన్ని భరించలేకపోయారు. అలా ఆమె 15 ఏళ్ల వయసులో ‘ఆల్-ఇండియా వనవాసి కళ్యాణ్’ ఆశ్రమంలో అధికారికంగా చేరారు. ఇది గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ. అందులో విద్యాభ్యసంతోపాటు సేవా కార్యక్రమాలు ఆమెను ఆకర్షించేవి. అయితే ఆమె చురుగ్గా సేవ కార్యక్రమాల్లో పాల్గొంది మాత్రం కౌమరదశలోనే.
దుర్భరమైన అటవీ ప్రాంతాల్లో...
1980.. ఆ సమయంలో బస్తర్ చుట్టుపక్కల దుర్భరమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించడం కష్టంగా ఉండేది. అందుకే అక్కడకు ఏ స్వచ్ఛంద సంస్థని చేరుకోలేకపోయేవి. దాంతో ఆ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. అలాగే కనీస సాయం కూడా పొందలేక అక్కడి ప్రజలు విలవిల్లాడేవారు. అలాంటి ప్రాంతాలకు ఆమె స్వయంగా కాలి నడకన వెళ్లి తను చేయగలిగింది చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో బతకలేక ప్రజలు వలసలు పోతున్నారు. లెక్కలేనన్ని సవాళ్లు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. నిజానికి ఈ పనికి ఆమె స్వచ్ఛంద సంస్థ నుంచి కూడా ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదు. అయినాసరే వెనక్కి తగ్గకుండా ఆమె ఆ బస్తర్ చుట్టుపక్కల అబుజ్మడ్ వంటి అత్యంత వెనుకబడిన కష్టతరమైన అటవీ ప్రాంతాల్లో సుమారు 570 గిరిజన గ్రామాలను కాలినడక సందర్శించారు. ఆకలి దప్పికలు మరిచి ఆ ప్రజల కష్టాలను తెలుసుకున్నారు.
తొలి బాలికల హాస్టల్...
అక్కడ పిల్లలు పాఠశాలకు వెళ్లేలా ప్రోత్సహించి వారికి చదువు అందేలా చేశారు. తల్లిదండ్రులకు విద్య పట్ల అవగాహన కల్పించి పిల్లలను బడికి పంపేలా ఒప్పించారు. అంతేగాదు సరైన రోడ్డు మార్గం లేక స్కూల్‌కి రాలేకపోతున్న పిల్లల కోసం హస్టల్ ఏర్పాటు చేసి ప్రోత్సహించే ప్రయత్నం చేశారామె. అలా తొలి బాలికల హాస్టల్ 1990లో బర్సూర్‌లో 11 మంది బాలికలతో ప్రారంభమైంది. ఆమె చొరవ కారణంగానే ప్రభుత్వానికి ఆ గ్రామాల సమస్యలు తెలిసి రోడ్డు, రవాణ వంటి కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు దారితీసింది. ‘మేము వారి ఇండ్లకు వెళ్లి పిల్లలను బడికి పంపించమని అడిగితే మా ముఖంపైనే తలుపులు వేసుకునేవారు. మొదట్లో చాలా బాధపడ్డాము. కానీ ఒప్పిగా వారితో మేము మాట్లాడిన తర్వాత మెల్లగా ఆ మూసుకున్న తలుపులు తెరుచుకున్నాయి. 90ల్లో చిన్నగా ఓ స్కూల్ ప్రాంభించాము. అక్కడితో ఆమె ఆగిపోలేదు. తల్లి శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా సహాయక బృందాలనే ఏర్పాటు చేసి వారందర్నీ ఏకతాటిపైకి వచ్చేలా చేశారు.
విద్య చాలా అవసరం...
‘మొదట ఆమె మా దగ్గరకు వచ్చి మహిళలను ఒక చోట చేర్చారు. మా అందరికీ కుట్టు పని ర్పించారు. ఆమె చేసిన ఈ సాయం వల్ల నాలాంటి ఎంతో మంది మహిళలు జీవనోపాధి పొందగలిగారు, మా పిల్లలు బడికి వెళ్లి చదువుకుంటున్నారు’ అంటూ ఎంతో ఆనందంగా చెబుతున్నారు దంతేవాడకు చెందిన అంతి వేక్ అనే మహిళ. ఈ విధంగా ఆమె మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు అయ్యేలా ప్రోత్సహించారామె. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మహిళల విద్య, స్వావలంబన కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆమె. ‘మహిళల కోసం మనం పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు. వారు ఈ సమాజంలో సమృద్దిగా ఎదగాలంటే విద్య అవసరం. ఇలాంటి ప్రయత్నం ఇంకా జరగాల్సి వుంది. ఇది నా ఒక్కదాని వల్లనే సాధ్యం కాదు. అందరూ కలిసి చేయాల్సిన కృషి ఇది. అడవి ప్రాంతంలోని ఓ వ్యక్తిని అభివృద్ధి పథంలోకి తీసుకొస్తే అది వారిలో ఆత్మవిశ్వాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది’ అంటారు ఆమె. నాలుగు దశాబ్దాలలో వందలాది గ్రామాలు, లెక్కలేనన్ని జీవితాల్లో వెలుగులు నింపారామె.
అందరికీ ‘బడి దీదీ’
ఇప్పటికీ బుద్రి తాటి ఆ గ్రామాలను సందర్శిస్తూ.. అక్కడి కుటుంబాలతో చక్కటి సత్సంబంధాలు ఏర్పరుచుకుంటూ మరిన్ని సేవలందించే ప్రయత్నం చేస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆ ప్రజలు ఆమెను నమ్మేలా వాళ్ల మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు ఆ గిరిజన ప్రాంతాలు ఆమెను ‘బడి దీదీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అలాగ ఆమె తన జీవతకాలం ఇలా నిస్వార్థ సేవకే అంకితమై చేసిన కృషని భారత ప్రభుత్వం గుర్తించి ఇటీవల భారత అత్యున్న పురస్కారమైన పద్మశ్రీతో గౌరవించి సత్కరించింది. అయితే బుధ్రి ప్రచారానికి, పురస్కారాలకు చాలా దూరంగా ఉంటారు. దశాబ్దాలు నిశబ్దంగా సేవ చేస్తూ ప ోతున్నారు. ఇన్నేళ్లకు ఆమె నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు లభించడం విశేషం. ఈమె కథ సేవ చేయాలనే సంకల్పానికి ఆర్భాటాలు ప్రచారాలతో పనిలేదు.. ఆ గొప్ప పనే ఏదో ఒక రోజు గుర్తింపు తెచ్చేలా చేస్తుంది అని నర్మగర్భంగా చెబుతోంది.






కామెంట్లు (0)